మాజీ మంత్రి మెరుగు నాగార్జునపై ఓ మహిళ పెట్టిన అత్యాచారం కేసును హైకోర్టు క్వాష్ చేసింది. ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కొన్నాళ్ల కిందట మంగళగిరి పోలీసులకు విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనకు ఉద్యోగం, కాంట్రాక్టులు ఇప్పిస్తానని లక్షల్లో నగదు తీసుకోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నాడని .. పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే ఆజ్ఞాతంలోకి వెళ్లిన మెరుగు నాగార్జున ..కేసు పెట్టిన మహిళతో రాజీ చేసుకున్నారు.
తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసు పెట్టిన మహిళ ఫిర్యాదును ఉపసంహరించుకుంటామన్నారని … తాము రాజీకి వచ్చామని ఆయన చెప్పారు. ఆ మహిళ కూడా అదే చెప్పింది. తాను పొరపాటున మాజీ మంత్రిపై కేసు పెట్టానని ఉపసంహరించుకుంటానని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం దర్యాప్తు సగంలో ఉందని ఈ దశలో ఉపసంహరించుకోవడం ఏమిటని వాదించారు. హైకోర్టు రెండు, మూడు సార్లు విచారణ జరిపినా ఆ మహిళ .. కేసు ఉపసంహరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో.. పోలీసులు కూడా అంగీకరించడంతో క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మెరుగు నాగార్జున మంత్రిగా ఉన్న సమయంలో మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. అయితే ఆమెకు ఇస్తామన్న ప్రయోజనాలు ఇవ్వకపోవడం.. ఈ లోపు అధికారం పోవడంతో ఆమె అడిగి అడిగి విసిగిపోయారు. పదవులు లేకపోవడంతో ఆ మహిళ ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు చాలా సీరియస్ కావడంతో అరెస్టు చేస్తారన్న భయంతో ఆ మహిళకు ఇవ్వాల్సినవే కాకుండా కాస్త ఎక్కువే రాత్రికి రాత్రికి ఇచ్చి కేసు ఉపసంహరణకు అంగీకరింపచేశారు. ఎలాగోలా రేప్ కేసు నుంచి బయటపడ్డారు.