అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో ఐదు శాతం భూముల్ని పేదల నివాస గృహాలకు వినియోగించాలన్నది చట్టం. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఇప్పుడే భూముల్ని ఎలా పంచుతారు..? …. రాజధాని ప్రాంతంలోని 1251 ఎకరాలను.. ఇళ్ల స్థలాలుగా ఇతర ప్రాంతాలక వారికి కేటాయిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ధర్మానసం చేసిన వ్యాఖ్య ఇది. దీనికి అడ్వకేట్ జనరల్ వద్ద సమాధానం లేకపోయింది. ప్రజారాజధానిగా మారాలంటే.. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి జనం రావాల్సి ఉందని.. అందుకే.. ఇతర ప్రాంతాల వారికి స్థలాలు కేటాయిస్తున్నామని ఏజీ వాదించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వాల్సి ఉందని.. అవి ఇవ్వకుండానే.. ఇతరులకు ఎలా పంపిణీ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎలా సమర్థించుకుంటారో తెలియచేస్తూ.. సోమవారానికల్లా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
సీఆర్డీఏ చట్టం ప్రకారం.. తాము ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. అదే చట్టం ఆధారంగా.. ప్రభుత్వం బాధ్యతల్ని కూడా గుర్తించేలా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసి.. ప్రమాణపత్రం దాఖలు చేయమనడంతో.. ప్రభుత్వ తరపు న్యాయవాదులకు కొత్త చిక్కులు ఏర్పడినట్లయిందన్న భావన న్యాయవాద వర్గాల్లో ఏర్పడింది. బయట వ్యక్తులకు స్థలాలు కేటాయించడంపై కూడా.. ఏజీ వాదనను.. పిటిషనర్ల తరపు లాయర్లు సమర్థంగా తిప్పికొట్టారు. రాజధాని పరిధిలోని వారికే ఇస్తున్నామని.. ఏజీ చెప్పారు కానీ.. కోర్ క్యాపిటల్ ఏరియా.. రాజధాని ఏరియా రెండూ వేర్వేరని… ఆ మేరకు నిబంధనల్ని కూడా.. పిటిషనర్ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తన వాదనను సమర్థించుకోవడానికి …హైకోర్టులో మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. పేదల కోసం.. రాజధాని పరిధిలో గత ప్రభుత్వం 5300 ఇళ్లను నిర్మించిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తాము మొదటి సారే ఈ భూపంపిణీ చేయడం లేదని.. గత ప్రభుత్వం ఇళ్లు కట్టించిందని ఏజీ చెప్పారు. గత ప్రభుత్వం 5300 ఇళ్లను రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు కట్టించింది. వాటికి లాటరీ కూడా నిర్వహించింది. వారికి స్వాధీనం చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారడంతో పంపిణీ నిలిపివేశారు. ఇప్పుడు రాజధాని పరిధిలోని వారందరికీ అక్కడ ఇళ్లు నిర్మించారు కాబట్టి.. బయటి వారికి రాజధాని గ్రామాల్లో ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న వాదనను..పిటిషనర్ తరపు న్యాయవాదులు బలంగా వినిపించే అవకాశం దక్కింది.