తెలంగాణా ప్రభుత్వానికి ఇవ్వాళ్ళ హైకోర్టు మళ్ళీ మొట్టికాయలు వేసింది. జంట నగరాలలో అక్రమ కట్టడాలను రాష్ట్ర ప్రభుత్వం తరచూ క్రమబద్దీకరణ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుండటం వలన, ప్రభుత్వమే ప్రజలను అందుకు ప్రోత్సహిస్తున్నట్లవుతోందని ఆ కారణంగా హైదరాబాద్ జంట నగరాల రూపు రేఖలే పూర్తిగా మారిపోతున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నస్ హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ వేసింది.
దానిని ఈరోజు విచారణకు చేపట్టిన హైకోర్టు, తెలంగాణా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరచుగా అక్రమ భవనాలను క్రమబద్దీకరణ చేసుకొనేందుకు వీలు కల్పిస్తుండటంతో ఒక క్రమబద్దంగా అభివృద్ధి చెందవలసిన నగరం అడ్డదిడ్డంగా పెరిగిపోతోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. భవనాలకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినపుడు, ప్రభుత్వం వాటిని క్రమబద్దీకరించడం ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశం పంపిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. అసలు అక్రమంగా నిర్మించిన భవనాలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన క్రమబద్దీకరించుకొనే అవకాశం కల్పిస్తోంది? దానికి అది అనుసరిస్తున్న విధివిధానాలు ఏమిటని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంతవరకు జంట నగరాలలో ఎన్ని అక్రమ కట్టడాలను ప్రభుత్వం క్రమబద్దీకరించిందో, ఇంకా ఎన్నిటిని క్రమబద్దీకరించబోతోందో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పొందడానికి లేకపోతే ఈవిధంగా మునిసిపాలిటీలకు అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి తరచూ క్రమబద్దీకరణ పధకాలను ప్రకటించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్రమబద్దీకరణకు అనుమతిస్తుంటే, దాని వలన సామాన్య ప్రజల కంటే నిర్మాణ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే ఎక్కువ లబ్ది పొందుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్లాన్ ప్రకారం ఒక అపార్టుమెంటులో ఐదు అంతస్తులకే అనుమతులు తీసుకొని, పైన ఒక పెంట్ హౌస్, పార్కింగ్ కోసం వదిలిపెట్టాల్సిన సెల్లార్ లో ఒకటో రెండో ఫ్లాట్స్ నిర్మించేసి సొమ్ము చేసుకొంటున్నారు. క్రమబద్దీకరణకు అవకాశం వస్తుందనే నమ్మకంతో కొందరు ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్లు అక్రమ కట్టడాలు నిర్మించుకొంటున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లు తయారవుతోంది పరిస్థితి.