సిట్ విచారణ తీరుపై ఛార్మి అభ్యంతరం తెలుపుతూ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకింకా పెళ్లి కాలేదని, తమది పరువు గల కుటుంబం అని, తన కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేని కారణంగా విచారణ సమయంలో తనతో పాటు తన న్యాయవాదిని తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఛార్మి కోరుకొంది. అంతే కాదు..తన అంగీకారం లేకుండా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించకుండా చూడాలని పిటీషన్ దఖలు చేసింది. ఈరోజు హైకోర్టులో ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. దీనిపై హైకోర్టు తీర్పు వెలువరించింది.
బలవంతంగా రక్త నమూనాలను సేకరించే అధికారం సిట్‌కి లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఛార్మిని విచారించాలని ఆదేశించింది. ఒకవేళ విచారణ పూర్తికాకపోతే మరో రోజు విచారణకు పిలవాలని సూచించింది. విచారణ బృందంలో మహిళను నియమించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సిట్ విచారణలో తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలన్న ఛార్మి విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించలేదు. మొత్తానికి ఛార్మి రక్త పరిక్షల టెస్ట్ నుంచి తప్పించుకొంది. అయితే విచారణకు మాత్రం సోలోగా హాజరవ్వాల్సిందే.