అసైన్డ్ భూములను ఎప్పుడో దశాబ్దాల కిందట కొనుగోలు, అమ్మకాలు చేశారన్న కారణాన్ని ఇప్పుడు చూపించి అమరావతిలో దళిత రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ జీవపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం వాటిని విక్రయించుకునేందుకు జీవో నంబర్ 41ని గత తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 41 ను రద్దు చేసి.. దాని స్ధానంలో జీవో నంబర్ 316 విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 316వ నెంబర్ జీవో ప్రకారం అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధం.
దీంతో తాజా జీవో ఆధారంగా గతంలో జరిగిన క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ లావాదేవీలు నిర్వహించిన రైతులకు నోటీసులు జారీ చేసింది. నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు. ఈ నోటీసులపై అసైన్డ్ రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు జీవోపై హైకోర్టు తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసైన్డ్ రైతుల్లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీరిలో ఓ కేటగిరీ కింద ఉన్న రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ రైతులకు ప్రభుత్వం నేరుగా అసైన్డ్ భూమి కేటాయించలేదు. కానీ కేటాయించిన వారి దశాబ్దాల కిందటే కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.
అన్ని రికార్డుల్లోనూ వీరి పేరు ఆ భూముల జాబితాలో ఉంది. అయితే ఎప్పుడు కొనుగోలు చేసినప్పటికీ .. ఇలా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం చెల్లదు కాబట్టి భూముల్ని వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అమల్లో ఉన్న జీవో ఆధారంగానే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు చెప్తున్నారు. ప్రభత్వం కూడా గుర్తించిందని .. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ స్థలాలు, పొలాలుల తమవి కావని రద్దు చేయడం అంటే అన్యాయం చేయడమేనని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.