ఇటీవల హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న తెలంగాణా ప్రభుత్వానికి ఈరోజు చాలా ఉపశమనం లభించింది. జీవో: 123ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులని, రైతు కూలీలకి తగిన విధంగా నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామని, అందుకోసం త్వరలో తెలంగాణా ప్రభుత్వం మరో జీవోని జారీ చేస్తుందని ఆ రాష్ట్ర ఎద్వాకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి హామీ ఇవ్వడంతో జీవో:123ని పునరుద్దరించి, ఈ కేసుపై విచారణని గురువారానికి వాయిదా వేసింది. ఆలోగా కొత్త జీవోని విడుదల చేసి ఆ ప్రతిని తమకి సమర్పించాలని ఆదేశించింది. తుది తీర్పుకి లోబడే అన్ని వ్యవహారాలు జరపాలనే షరతు కూడా విధించింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలతో, న్యాయస్థానంలో ఎదురుదెబ్బలతో విసిగివేసారి పోయున్న తెలంగాణా ప్రభుత్వానికి ఇది చాలా ఊరటనిచ్చే విషయమే. కనుక ఇక భూసేకరణ పనులను వేగవంతం చేయవచ్చు.
హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు బంతి మళ్ళీ ప్రతిపక్షాల కోర్టులో పడినట్లయింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టు జీవో: 123ని రద్దు చేసినప్పుడు అది తమ విజయమేనని చెప్పుకొని సంబరాలు చేసుకొన్నాయి. తెలంగాణా ప్రభుత్వానికి పరిపాలన చేత కాదని, హైకోర్టు తీర్పు దానికి చెంప దెబ్బ వంటిదేనని గట్టిగా వాదించాయి. కనుక ఇప్పుడు ఈ తాజా తీర్పుపై ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.