తెలంగాణా విద్యుత్ సంస్థల నుండి తొలగింపబడ్డ 1200మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారి కేసును ఈరోజు విచారణకు చేప్పట్టిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. వారందరూ తెలంగాణా ప్రభుత్వానికే చెందుతారని నిర్ద్వందంగా ప్రకటించింది. కనుక వారిని తెలంగాణా విద్యుత్ సంస్థలు విధులలోకి తీసుకోవాలని ఆదేశించింది. కానీ వారందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కనుక ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు కలిసి వారికి 58:42నిష్పత్తిలో జీతాలు చేల్లిస్తుండాలని ఆదేశించింది. నాలుగు వారాలలోగా వారి వేతన బకాయిలను కూడా అదే నిష్పత్తిలో చెల్లించాలని హైకోర్టు రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. తుది తీర్పు వెలువడేవరకు ఇదే పద్దతిని అమలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సమస్య పరిష్కారం అయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ ఇప్పుడు కూడా తెలంగాణా ప్రభుత్వం తన వాదనకే కట్టుబడి తను తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకొనేందుకు అంగీకరించకపోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఒకవేళ ఆంద్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని మన్నించి ఆ 1200మంది ఉద్యోగులకు తన వాటాగా 58 శాతం జీతాలు చెల్లించడానికి అంగీకరిస్తే, ఇకపై వివిధ తెలంగాణా ప్రభుత్వ శాఖలలో లేదా సంస్థలలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులకి అదే విధంగా చెల్లించాల్సి వస్తుంది. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనకాడవచ్చును. కానీ ఉద్యోగుల పరిస్థితిని తమ బాధ్యతని దృష్ట్యా రెండు ప్రభుత్వాలు హైకోర్టు తీర్పుకి కట్టుబదేందుకు అంగీకరిస్తే ఎటువంటి సమస్య ఉండదు. అది సాధ్యమో కాదో త్వరలోనే తేలిపోతుంది.