తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని.. రాజకీయ పరిశీలకులే కాదు.. న్యాయనిపుణులు కూడా.. ఊహించలేకపోయారు. కేంద్ర పెద్దలతో సీఈసీకి ఉన్న సన్నిహిత సంబంధాలు, తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్రం సహకారం గురించి.. పూర్తి స్థాయిలో సమాచారం ఉన్న వాళ్లు మాత్రమే.. షెడ్యూల్ ప్రకటిస్తారని నమ్మారు. ఎందుకంటే… ఓటర్ల జాబితా అంశం అత్యంత కీలకమైనది. ఓటర్ల జాబితా ఫైనల్ కాకుండా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం బహుశా… స్వతంత్ర భారత దేశ చరిత్రలో జరిగి ఉండదు. ఈ అంశంపై హైకోర్టు విచారణలో ఏం తేలుతుందన్నదానిపై తదుపరి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ ఈసీ తొందరపడింది. ఈ విషయంలో తమకు విశేష అధికారాలు ఉన్నాయని ఈసీ భావించి ఉండవచ్చు. కానీ రాజ్యాంగ పరంగా ఎన్నికల నిర్వహణకు కావాల్సినంత సమయం అందుబాటులో ఉన్నప్పటికీ.. కోర్టును ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
ఓటర్ల జాబితా అంశంపై … హైకోర్టు నేడు మరో సారి విచారణ జరపనుంది. మామూలుగా అయితే.. తుది ఓటర్ల జాబితాను నేడు ప్రకటించాల్సి ఉంది. హైకోర్టుకు కూడా అదే చెప్పారు. కానీ ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. దీంతో పన్నెండో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. హైకోర్టు ఓటర్ల తుది జాబితాను తమకు ఇవ్వకుండా ప్రకటించవద్దని షరతు విధించింది. ఆ సమయంలో నోటిఫికేషన్ కూడా తమ రూలింగ్‌కు అనుగుణంగా ఉంటుందని కూడా చెప్పింది. ఈ విషయంలో ఈసీ .. హైకోర్టు రూలింగ్‌ను పట్టించుకోలేదని తెలిపింది. ఈసీ తుది ఓటర్ల జాబితా రెడీ కాలేదని చెప్పడం ఖాయమే కాబట్టి.. ఆ జాబితా ప్రకటిస్తామని చెబుతున్న పన్నెండో తేదీకి వాయిదా వేసే అవకాశం ఉంది.
కానీ హైకోర్టు కేసు విషయాన్ని పట్టించుకోకుండా.. ఈసీ షెడ్యూల్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని తాము కచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తామని పిటిషన్ శశిధర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో.. ఈసీ నిర్ణయంపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఈసీ ఒక సారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత… కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఈ అధికారాన్ని ఈసీ ఉపయోగించుకుంది. మరి కోర్టు తనకు అధికారాల మేరకు.. ఆదేశాలిస్తుందా..? ..ఓటర్ల జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.