రాజధాని ఆందోళనల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదమయింది. మహిళలని చూడకుండా.. వారు చేసిన నిర్భంధం.. చేసిన దాడులు.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్ తరహాలో.. కవాతులు చేయడం.. ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడం.. అర్థరాత్రుళ్లు అరెస్టులు చేయడం.. ఇలాంటివన్నీ.. ఏ చట్టం ప్రకారం చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. డీజీపీ ఏం చేస్తున్నారో.. ఎవరికీ తెలియలేదు. కానీ న్యాయ వ్యవస్థ మాత్రం స్పందించింది. పత్రికలు, మీడియాల్లో వస్తున్న దృశ్యాలు, వార్తలు చూసి చలించింది. అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించడమే కాదు.. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. శాంతియుత ఉద్యమాలను అడ్డుకోవద్దని.. స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వంలోనూ.. పోలీసుల్లోనూ కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకే.. పోలీసులు రాజధాని గ్రామాలపై విరుచుకుపడ్డారనేది.. అందరికి తెలిసిన విషయం. పోలీసులు సొంతంగా.. ఇలాంటి అరాచకాలకు పాల్పడే అవకాశం లేదు. కానీ.. పోస్టింగుల కోసం.. లేకపోతే.. రాజకీయ ప్రాధాన్యం కోసం.. కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు.. ప్రభుత్వ పెద్దల్ని మెప్పించేందుకు.. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతూంటారు. వారితోనే చిక్కులు వస్తాయి. ఇప్పుడు.. ఈ అత్యుత్సాహం.. వారి ఆదేశాలు పాటించిన పోలీసు అధికారుల మెడకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది.
నిజానికి హైకోర్టు ఆదేశించింది కాబట్టి.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో చిన్న చర్య తీసుకుని వదిలి పెట్టడానికి చాన్స్ ఉండదు. ఒక వేళ.. ఆ లాఠీచార్జులు.. మహిళలతో అనుచిత ప్రవర్తనలు ఎవరు చేయించారనేదానిపై విచారణ జరిపిస్తామని కాలయాపన చేస్తే.. అది ఇంకా.. పోలీసు అధికారులకు మైనస్ అవుతుంది. ఆ రికార్డు అలా ఉండిపోతుంది. రేపు ప్రభుత్వం మారిన తర్వాత .. రిటైరైపోయినా.. వారిని ఇది వెంటాడుతుంది. ఈ ఘటనలన్నింటినీ గుర్తు పెట్టుకుని అప్పటి ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే.. రిటైరైపోయినా… పోలీసు అధికారులకు చిక్కులు తప్పవంటున్నారు. మొత్తానికి పోలీసులు చట్టం ప్రకారం పని చేయాల్సింది పోయి.. అతి రాజభక్తి చూపించి.. సామాన్యులను.. వేధించి.. పలుచనైపోయారు. శిక్షకు గురవుతున్నారు.