తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు .. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కారణంతో అరెస్ట్ చేశారో చెప్పాలని… హైకోర్టు నిన్న తెలంగాణ పోలీసుల్ని ప్రశ్నించడంతో.. వారు ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ బుకాయించారు. ఆ నివేదిక అడిగితే.. ఈ రోజు ఇస్తామన్నారు. ఈ కేసుపై ఉదయమే హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు ఇచ్చిన వివరాలపై.. హైకోర్టు మండి పడింది. అర్థరాత్రి మూడు గంటలకు రేవంత్ ఇంటి గోడలు దూకి..తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడమేమిటని మండి పడింది. వ్యక్తుల్ని అరెస్ట్ చేసే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని.. వాటిని ఎందుకు పాటించలేదని.. హైకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ డీజీపీని మధ్యాహ్నం 2:15 గంటలకు హాజరుకావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల విధుల్లో డీజీపీ బిజీగా ఉన్నారని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. తాము కూడా కోర్టు కేసుల విచారణలో బిజీగా ఉన్నామని… ఒక అరగంట సమయం డీజీపీ కోర్టుకు రావడానికి కేటాయించలేరా అని ప్రశ్నించింది. ఏది ఏమైనా డీజీపీ కోర్టుకు హాజరుకావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. ఏ విధమైన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రేవంత్‌ను అరెస్ట్ చేశారనే దానిపై సవివరమైన నివేదికను అందజేయాలని మరోసారి స్పష్టం చేసింది.
మొత్తానికి రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం తెలంగాణ పోలీసుల తీరును మరోసారి కోర్టు బోనులో నిలబెట్టినట్లయింది. రేవంత్ రెడ్డి అరెస్టును సమర్థించుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో… పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని… విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టు అక్షింతలతో.. తెలంగాణ పోలీసులు మరింత పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది.