రాజకీయ ఎజెండాతో అధికార పార్టీ చెప్పినట్లుగా చేయడానికి ఏ మాత్రం ఆలోచించని పోలీసులకు మరోసారి షాక్ తగిలింది. బండి సంజయ్ అరెస్ట్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ సరికాదని కింది కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టింది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్ ఐ ఆర్ ఎలా నమోదు చేశారని.. అంత వేగంగా ఎలా సాధ్యమయిందని పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. రాత్రి 10:50 అరెస్టు చేస్తే 11 గంటల 15 నిమిషాలకు ఎఫ్ ఐ ఆర్ చేయడం సరైనది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఎఫ్ఐఆర్లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తోపులాట లో పోలీసుల కుడిచేయి వేలికి గాయమైందని లాయర్ చెప్పుకొచ్చారు. అయితే కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసుల గాయాల పై మెడికల్ రిపోర్ట్ అందాల్సి అందలేదని ఉందని న్యాయమూర్తి గుర్తు చేశారు. గాయం అయిందో లేదో మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎలా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి.. అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించారు.
బండి సజంయ్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. బండి సంజయ్ దీక్షపై పోలీసులు అంత తీవ్రంగా ఎందుకు స్పందించారో ఎవరికీ అర్థం కాలేదు. అత్యంత దారుణంగా పార్టీ కార్యాలయంలోకి చొరబడి మరీ దాడులకు దిగారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసుల ుఈ విషయంలో ఇబ్బందిపడే అవకాశం కనిపిస్తోంది.