కరోనా జాగ్రత్తలపై ఎప్పుడు విచారణ జరిగినా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం.. చెప్పిన మాటలే మళ్లీ కోర్టులో చెబుతూ ఉంటుంది. తాజాగా జరిగిన విచారణలోనూ హైకోర్టు అదే తరహాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టమైన సూచనలు చేసింది. జన సంచారం తగ్గించేందుకు సినిమాహాల్స్, క్లబ్‌లు..పబ్‌లు…మద్యం దుకాణాలు వంటి వాటిపై ఆంక్షలతో పాటు.. తెలంగాణలోకి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. టెస్టుల విషయంలో మరికొన్ని సూచనలు కూడా చేసింది. కానీ తెలంగాణ సర్కార్.. అన్నింటినీ లైట్ తీసుకుంది.
ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోలేదు. ఒక్క స్కూల్స్‌ను మూసివేయడం తప్ప… తెలంగాణలో అన్నీ యధావిధిగా సాగుతున్నాయి. దీంతో.. హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాల కన్నా.. ఆదాయమే ముఖ్యమా..అని సూచిగా ప్రశ్నించింది. ప్రభుత్వం ఇస్తున్న నివేదికలు కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయని… మండిపడింది. ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలా.. లేక ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందా చెప్పాలని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కార్ ఇప్పుడు కాదు.. మొదటి విడత కరోనా వేవ్ అప్పుడు కూడా.. హైకోర్టును పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై దాఖలైన అనేక పిటిషన్లను విచారిస్తున్న సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసేది. అయినప్పటికీ.. మారలేదు. ఆ తర్వాత కరోనా పరిస్థితి సద్దు మణిగింది. రెండో విడత వేవ్ ప్రారంభమయ్యాక.., మల్లీ కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. వాటిపై విచారణలోనూ… కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కానీ… తీరు మాత్రం మారడం లేదు. పాలనా పరమైన వ్యవహారాల్లో.. హైకోర్టు జోక్యం ఏమిటని.. ఏం ఆదేశాలిస్తారో ఇచ్చుకోనీయమన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని భావిస్తున్నారు. హైకోర్టు మాత్రం చాలా సీరియస్‌గా స్పందిస్తోంది.