జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రక్రియ కుదింపు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. పై స్టే విధించిన హైకోర్టు, శనివారంలోగా 150 డివిజన్లకు కేటాయించిన రిజర్వేషన్లను ప్రకటించి, ముప్పై రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఆ లెక్కన రేపటిలోగా రిజర్వేషన్లు ప్రకటించినట్లయితే, ఆదివారం లేదా సోమవారంనాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అర్ధమవుతోంది. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి నెలరోజులలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది కనుక ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికలు నిర్వహించవచ్చునని అర్ధమవుతోంది.
అంటే ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం (10వ తేదీన) విడుదల చేసినట్లయితే, ఆ మరునాటి నుంచి యదాప్రకారం వారం రోజులు అంటే జనవరి 19 లేదా 20 తేదీ నాటికి నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలన్నీ పూర్తవవచ్చును. అప్పటి నుండి వారం పది రోజులు ప్రచారానికి గడువు ఇవ్వవలసి ఉంటుంది కనుక ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించి అదే వారంలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెలువరించవచ్చును. రిజర్వేషన్ల ప్రకటనకి, ఎన్నికల నిర్వహణ హైకోర్టు నిర్దిష్టమయిన గడువులు విధించింది కనుక ఒకరోజు అటూ ఇటుగా ఇదే షెడ్యూల్ ప్రకారం జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగవచ్చునని ఖచ్చితంగా చెప్పవచ్చును.