గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థను ఏపీలో ప్రమోట్ చేస్తున్న సీఎం జగన్‌కు.. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఏపీ డెయిరీకి సంబంధించిన రూ. మూడు, నాలుగు వేల కోట్ల విలువైన ఆస్తులను.. చాలా తక్కువ మొత్తానికి లీజుకిచ్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసేసుకుని.. జీవో కూడా ఇచ్చేసిన సమయంలో… ఆ సంస్థ కోసం ప్రజాధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రజాధనాన్ని అప్పనంగా అమూల్‌కు కట్ట బెడుతున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జరిగిన విచారణ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నిజానికి ప్రభుత్వం తన వాదన వినిపించి ఉంటే.. ఈ ఉత్తర్వులు వచ్చాయో రావో కానీ.. ఇంతకు ముందు విచారణలో ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్ రిజిస్ట్రీ వద్ద కనిపించలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. పధ్నాలుగో తేదీ వరకూ.. అమూల్ కోసం.. ఎలాంటి నిధులూ ఖర్చు చేయవద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి అమూల్‌కు గోదావరి జిల్లాల్లోనూ రాచబాట వేస్తూ.. జగన్ ఈ రోజే పాలసేకరణను తన చేతుల మీదుగా ప్రారంభించారు. పాడి రైతులకు పెద్ద ఎత్తున లాభం ఇస్తారని.. అమూల్ పైసా కూడా లాభం తీసుకోకుండా.. రైతుల కోసం పని చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. ఏపీ పాడి రైతులను అమూల్‌కు తాకట్టు పెడుతున్నారు.. ఏపీడెయిరీకి చెందిన వేల కోట్ల ఆస్తులను అతి స్వల్ప మొత్తానికి లీజుకిచ్చి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
ఇదో పెద్ద స్కాం అంటున్నారు. అన్ని వేల కోట్ల ఆస్తులు అప్పనంగా అప్పజెబుతున్నప్పుడు… రివర్స్ టెండర్లు.. జ్యూడిషియల్ రివ్యూలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో పాటు అమూల్ సంస్థకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అమూల్ గుజరాత్‌కు చెందిన సహకార సంస్థ. ఏపీలో చాలా సహకార డెయిరీలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ.. అమూల్‌ను ప్రభుత్వం ప్రమోట్ చేయడం వెనుక గూడుపుఠాణి ఉందన్న అనుమానాలు కొద్ది రోజుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు విచారణతో అవి బయటకు వస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు.