రాజకీయ బాసులకు సలాంలు కొట్టి రాజ్యాంగ పదవుల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్న వారి వ్యవహారాల్లో కోర్టులు చేస్తున్న కీలక వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు సంచలనం అవుతున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని విషయంలో హైకోర్టు … పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్ట్ తీర్పును తమకు కావాల్సినట్టుగా ఏపీ ఎన్నికల కమిషన్ అన్వయించుకుందని.. చదవటం, అవగాహన చేతకాలేదని మండిపడింది. సుప్రీంకోర్ట్ తీర్పును తమకు ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోవటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్ట్ తీర్పులో నాలుగు వారాల సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది..ఇంగ్లీష్ భాషపై అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీంకోర్ట్ తీర్పు అర్థమవుతుందని హైకోర్టు తెలిపింది.
ఏపీ ఎన్నికల కమిషనర్.. గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసినా.. సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ధర్మానసం వ్యాఖ్యానించింది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆమె అర్హత పై ఆలోచించాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలను ధర్మాసనం చేసింది. ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించింది.. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. సుప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించడమే కాకుండా.. ఏప్రిల్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10వ తేదీన కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది.
ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధం, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నీలం సాహ్ని చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు.. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను ఎప్పుడూ పాటించలేదు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించలేదు. ఆమెపై కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు. ఇప్పుడు ఎస్ఈసీగా కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న విమర్శలు ఎదుర్కోవడం సంచలనం రేపుతోంది. అధికారులు… మొత్తం వ్యవస్థల్ని ధిక్కరించి మరీ ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనం రేపుతోంది.