ఎన్టీఆర్ శత జయంతి రోజున ఖమ్మంలోని లకారం చెరువులో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాల్సిన ఎన్టీఆర్ విగ్రహంపై వివాదాలు అలుముకున్నాయి. కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ ఉండటం అభ్యంతరకరం అంటూ పధ్నాలుగు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ విగ్రహాన్ని ఆవిష్కరించకుండూ స్టే విధించింది.
గత రెండేళ్లుగా ఈ విగ్రహం గురించి ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ విగ్రహం రూపు రేఖల గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. అయితే విగ్రహావిష్కరణ తేదీ దగ్గర పడే సరికి రాజకయాలు పుట్టుకు వచ్చాయి. ఈ విగ్రహావిష్కరణ బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో జరుగుతోంది. దీంతో ఇతర పార్టీల నేతలు.. న్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందనే వాదన తీసుకు వచ్చాయి.
యాదవ సంఘాల పేరుతో కొంత మంది రచ్చ ప్రారంభించారు. కరాటే కల్యాణి నేరుగా ఖమ్మంకు వెళ్లి యాదవ సంఘం తరపున ధర్నా చేశారు. అయితే ఖమ్మంలోని మెజార్టీ యాదవ సంఘాలు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను స్వాగతించాయి. ఉమ్మడి రాష్ట్రంలో దేవుళ్ల రూపంలో ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయని.. వాటికి లేని అభ్యంతరం ఖమ్మంలోనే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
కారణం ఏదైనా రాజకీయం అయింది.. హైకోర్టు వరకూ వెళ్లి స్టే వచ్చేసింది. ఇప్పుడు 28న ఆవిష్కరణ చేయాలంటే.. అర్జంట్‌గా డివిజన్ బెంచ్ కు వెళ్లి అనుమతి పొందాల్సి ఉంది. మరి ఈ బాధ్యతలు చూసుకుంటున్న మంత్రి పువ్వాడ అజయ్ ఏం చేస్తారో ?