విశాఖలో ఖరీదైన స్థలాలను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. టెండర్లు ఖరారు చేయవద్దని ఆదేశించింది. గతంలో బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకానికి ప్రయత్నించారని హైకోర్టు స్టే ఇచ్చిందని.. అయినప్పటికీ.. ఇతర భూములను అమ్మకానికి పెట్టారని .. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం అమ్ముతున్న భూములకు కూడా ఆ స్టే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో భూముల అమ్మకాలకు పిలిచిన టెండర్లు ఎక్కడివక్కడ ఆగిపోనున్నాయి.
వేలం వేసే బ్రోకరేజీ సంస్థ ఎన్బీసీసీ ద్వారా పెద్ద ఎత్తున భూములను అమ్మకానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆగనంపూడి, ఫకిర్ టకియా ప్రాంతాల్లోని ఐదు స్థలాలతో పాటు బీచ్ రోడ్లో ఉన్న మరో స్థలాన్ని వేలానికి పెట్టారు. ఆగనంపూడి, ఫకిర్టకియాలో ఉన్న ఐదు స్థలాలు.. అన్ని ఎకరం.. అర ఎకరం లోపువే. దీంతో వీటి విలువ నాలుగైదు కోట్ల మధ్యలోనే ఉంటుంది. కానీ బీచ్లో వేలానికి పెట్టిన స్థలం మాత్రం పదమూడున్నర ఎకరాలు ఉంటుంది. ఇది అత్యంత విలువైనది. దీని విలువను 1452కోట్లుగా నిర్ధారించారు. ఇవికాకుండా… మరికొన్ని స్థలాలను కూడా వేలానికి పెట్టారు. మొత్తానికి పద్దెనిమిది ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని నిర్ణయించారు.