విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 10న చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడారు. ఆయన తల నరుకుతానని బహిరంగంగా హెచ్చరించారు. తెదేపా నేతల పిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను ఈకేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆమె ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ని నిన్న విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే మంజూరు చేసింది. కానీ కేసును రద్దు చేయాలన్న ఆమె అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది.