కొన్ని సినిమాలలో పోలీసులను చాలా గొప్పగా చూపిస్తుంటారు. మరికొన్నిటిలో చాలా దుర్మార్గులుగా, అవినీతిపరులుగా చూపిస్తూ హీరోల చేతుల్లో చావు దెబ్బలు తినిపిస్తుంటారు మన దర్శక నిర్మాతలు. పోలీస్ అధికారుల సంఘం అటువంటి వాటిపై అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమాలలో తమను చులకనగా చూపించడం మానుకోవాలని వారు తెలుగు సినీ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేసారు. ఇకపై తమ గురించి సినిమాలలో తప్పుగా లేదా తమ గౌరవానికి భంగం కలిగేలా చిత్రీకరిస్తే, అటువంటి వాటిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే శ్రీకాంత్, అక్ష జంటగా నటించిన ‘మెంటల్ పోలీస్’ సినిమా దర్శక, నిర్మాతలతో బాటు హీరో శ్రీకాంత్ కి కూడా పోలీస్ అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపించింది. ఆ సినిమా పేరు తమ గౌరవానికి భంగం కలిగించేదిగా ఉంది కనుక తక్షణమే దాని పేరు మార్చాలని వారు కోరారు. అంతేకాక ఆ సినిమా విడుదలని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ కేసును సోమవారం చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత, పోలీస్ అధికారుల సంఘం వాదనలతో ఏకీభవిస్తూ సినిమా పేరు మార్చే వరకు విడుదల చేయవద్దని ఆదేశిస్తూ స్టే విధించింది. కరణం పి. బాబ్జి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రసాద్ దాసరి, దుర్గాప్రసాద్ అనగాని నిర్మించారు. ఇకపై సినీ నిర్మాతలు, దర్శకులు పోలీసుల పాత్రలను సృష్టించేటప్పుడు దానికీ కొన్ని పరిమితులున్నాయని గ్రహించడం చాలా అవసరం అని హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. కానీ అది సాధ్యమేనా? అంటే అనుమానమే.