ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం మరో కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం దానిని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. దానిని ముఖ్యమంత్రి హరీష్ రావత్ రాష్ట్ర హైకోర్టులో సవాలు చేసారు. దానిపై నేడు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు, రాష్ట్రపతి పాలనపై స్టే విధించింది. అంతే కాదు ఈనెల 31న రాష్ట్ర శాసనసభలో బలనిరూపణ చేసేందుకు కూడా ముఖ్యమంత్రికి అవకాశం కల్పించింది. కోర్టు తీర్పు మోడీ ప్రభుత్వానికి చెంప దెబ్బ వంటిదేనని చెప్పకతప్పదు.
నిజానికి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన తరువాత, ఈనెల 28న అంటే నిన్న శాసనసభలో బలం నిరూపించుకోమని గవర్నర్ ముఖ్యమంత్రిని ఆదేశించారు. అందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. కానీ ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం ఒక్కరోజు ముందు అంటే మార్చి 27న హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించేసి చేతులు దులుపుకొంది.
రాష్ట్రపతి పాలన విధించాల్సినంత అత్యవసరమయిన లేదా ప్రమాదకరమయిన పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవు. ఒకవేళ ఉంటే పాకిస్తాన్ కి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లోనే అటువంటి పరిస్థితులున్నాయి. కానీ అక్కడ పిడిపితో కలిసి భాజపా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంటోంది కనుక దానికి అక్కడ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు కనబడలేదు. అందుకే గత మూడు నెలలుగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించి పిడిపితో తాపీగా బేరసారాలు కొనసాగిస్తోంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతోంది కనుకనే రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకోవడం సిగ్గు చేటు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పని చేస్తుంటే, దానిపై న్యాయస్థానాలలో పిటిషన్ వేయవచ్చును కానీ, దాని ఉద్దేశ్యం ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి దాని స్థానంలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కనుక ముఖ్యమంత్రి హరీష్ రావత్ కి శాసనసభలో బలనిరూపణకు అవకాశం ఇవ్వకుండా హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించింది.
ఇప్పుడు హైకోర్టు దానిపై స్టే విధించడంతో చెంపదెబ్బ తింది. ఒకవేళ హరీష్ రావత్ శాసనసభలో తన బలం నిరూపించుకోగలిగినట్లయితే, అది మళ్ళీ మరొక చెంపదెబ్బ అవుతుంది. ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం ఇటువంటి అప్రజాస్వామిక విధానాలను మానుకోకపోతే మున్ముందు ఇంకా ఇటువంటి చెంప దెబ్బలు చాలా తినాల్సివస్తుంది.