ఓటుకి నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టులో ఊరట లభించింది. ఆ కేసులో తెలంగాణా ఏసిబి తనపై విచారణ జరుపకుండా ఆదేశాలు జారీ చేయాలనే ఆయన అభ్యర్ధనని హైకోర్టు మన్నిస్తూ స్టే మంజూరు చేసింది. కనుక ఈ కేసు నుంచి ఆయన తాత్కాలికంగా విముక్తి పొందినట్లే భావించవచ్చు. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొనబడిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, తెలంగాణా ఏసిబిని రెండు నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసి అప్పటి వరకు కేసు వాయిదా వేయడంతో, చంద్రబాబు నాయుడుకి అంతవరకు మాత్రమే సమయం ఇచ్చిందని రామకృష్ణా రెడ్డి తరపున వాదించిన న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయాలనుకొంటున్నట్లు రామకృష్ణా రెడ్డి మీడియాకి తెలిపారు.
హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి ఊరట లభించినప్పటికీ ప్రతిపక్షాల నుంచి విమర్శలని తప్పించుకోలేకపోయారు. “నా మీద ఎటువంటి కేసులు లేవు. నేను ఎవరికీ భయపడను. నిప్పులాంటి మనిషిని. నిప్పులాగా బ్రతుకుతున్నాను. ఓటుకి నోటు కేసుతో నాకు సంబంధమే లేదు. ఆ కేసులో తన పేరు నమోదు చేయలేదు,” అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎందుకు హైకోర్టుని ఆశ్రయించారు? ఎందుకు స్టే తెచ్చుకొన్నారు? అని కాంగ్రెస్, వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుతో తనకి ఎటువంటి సంబంధమూ లేనప్పుడు, అందులో తన పాత్ర లేదనుకొన్నప్పుడు ఆయన ధైర్యంగా ఆ కేసుని ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా? అని ఎద్దేవా చేస్తున్నాయి.
అయితే తెదేపా ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర ప్రభుత్వాన్ని, తమ పార్టీని అప్రదిష్ట పాలుజేసేందుకే వైకాపా ఇటువంటి కుత్రాలకి పాల్పడుతోందని ఆరోపిచారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం ఎదుర్కోగలదని అన్నారు. అసలు ఏసిబి కోర్టుకి ఈ కేసుని విచారించే అర్హతే లేదని అన్నారు. కానీ ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకి ఆయన కూడా సమాధానాలు ఇవ్వలేదు.