హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీస్ ప్రొవైడర్లు ఏపీ పోలీసులు కోరిన కాల్ డేటాను ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పుమీద హైకోర్టు స్టే విధించింది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన కాల్ డేటావివరాలను సీల్డ్ కవర్లో రేపటిలోగా విజయవాడకోర్టుకు అందజేయాలని, విజయవాడ కోర్టు దానిని ప్రత్యేక మెసెంజర్ ద్వారా తమకు అందజేయాలని హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే అమలులో ఉంటుంది. తదుపరి విచారణ నాలుగువారాల తర్వాత ఉంటుంది.
విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చినపుడు తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రసిద్ధ న్యాయవాది రాంజెఠ్మలాని వాదించారు. ఫోన్ ట్యాపింగ్ చట్టపరిధిలో నిబంధనలమేరకే జరిగిందని, కాల్ డేటా ఇవ్వమని ఆదేశించే అధికారం విజయవాడు కోర్టుకు లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌ను తీవ్రమైన నేరాలకే చేయొచ్చని, అదికూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది వేణుగోపాల్ వాదించారు.