ఓటుకు నోటు కేసులో హైకోర్టు స్టే ఇవ్వడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వూరట లభించిందని వెబ్సైట్లలో శీర్షికలు వచ్చాయి. నిజానికి ఉద్రిక్తత నుంచి వూరట వచ్చిందేమో గాని ఇకపై ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి తప్పదు. ఈ కేసులో ఎసిబి చర్యలు, టిసర్కారు కదలికలు చూడకుండా ఆయన హడావుడి పడ్డారు. తద్వారా కేసును జటిలం చేసుకున్నారు. ఎసిబి కోర్టు ఆదేశాలతో వచ్చిన తక్షణ ముప్పు ఏమీ వుండబోదని వైసీపీ ఓవర్ ఎస్టిమేషన్స్ వేస్తున్నదని నేను మొదట్లోనే వ్యాఖ్యానించాను. ఇది కొందరికి నచ్చలేదు కూడా. అయితే ఆయన మాత్రం స్టే కోరుతూ కోర్టుకు వెళ్లారు. దీనిపై సాంకేతికంగా హైకోర్టు ఎనిమిది వారాల స్టే మంజూరు చేసింది. ఈ లోగా ఎసిబిని వివరమైన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అది ఏ రూపంలో వుంటుందో తెలియదు. తర్వాత కోర్టు ఏమంటుందో తెలియదు. పైగా పిటిషనర్ రాజకీయ ఉద్దేశ్యాలు వున్నాయనే కారణంతో స్టే కోరారు. మౌలికంగానే ఈ కేసు తప్పు మొదటే విరమించాలని వాదిస్తే అది వేరే సంగతి కాని ఆ అవకాశం లేదు. అసలు మొదటే ఎసిబికోర్టు దాదాపు నెలరోజులు గడువిచ్చింది. ఆ పైన ఈ మాత్రం వ్యవధి ఎలాగూ వుంటుంది. రాజకీయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఆసక్తి చూపడం లేదు సరికదా కొంత అభయం కూడా వుంది.అయినా అంత అ భద్రతకు గురికావడం ఆశ్యర్యమే.ఎసిబి. ఏం చేస్తుందో చూసిన తర్వాత అడుగు వేసి వుంటే అదోరకంగా వుండేది. జగన్ తనను డిస్టర్బ్ చేస్తున్నాడన్న వ్యాఖ్య కూడా అభద్రతను వెల్లడించింది.
.. కనుక ఈ స్టే ఏదో ఘన విజయమైనట్టు ఇతరులకు చెంపపెట్టు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటివారు విమర్శించడం హాస్యాస్పదం. లాయర్లు చూసుకుంటారని చెప్పిన చంద్రబాబు తరపున పార్టీ నేతలు రంగంలోకి దిగడం అవసరం లేనిపని. ఇంతవరకూ వచ్చాక అసలు కేసే రాజకీయ ప్రేరితమంటే అప్పుడు టిఆర్ఎస్ కూడా తన ప్రతిష్టను చూసుకోవలసి వస్తుంది. ఎనిమిది వారాలు స్టేరాగానే ఆనందతాండవం చేయడం అవతలివారిపై దాడికి దిగడం అర్థంలేని అవసరం లేని పని. ఇదంతా దీర్ఘకాలంలో చంద్రబాబుకు టిడిపికి పెద్ద లాభం చేయదు సరికదా విమర్శలే పెంచుతుంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఆయన భావించివుంటారు గాని చిన్న పామును పెద్దది చేస్తున్నాననే నిజం గ్రహించినట్టు లేదు. ఎందుకంటే ఇక కెసిఆర్ సర్కారుకు ఆచితూచి అడుగులు వేసే అవసరం వుండదు. అంతా వారే వాదించుకుంటున్నారని తప్పించుకునే అవకాశం లభిస్తుంది.