గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి, గ్రేటర్ పరిధికి బయట ఉన్న ఎమ్మెల్సీలకి ఎటువంటి సంబంధము లేదు. ఉండకూడదు. కానీ మేయర్ పదవిని ఏదో విధంగా దక్కించుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్సీలకు కూడా ఎక్స్ అఫీషియోలుగా ఓటు వేసే హక్కు కల్పిస్తూ తెరాస ప్రభుత్వం 207 జీవోని జారీ చేసింది. తద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అయినా మేయర్ ఎన్నికలలో ఓటు వేయవచ్చును. కనుక మేయర్ పదవి తెరాసకే దక్కుతుంది.
మేయర్ పదవి దక్కించుకోవడం కోసమే తెరాస ప్రభుత్వం ఈవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని సవాలు చేస్తూ తెలంగాణా పిసిసి ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం వేసారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే, జస్టిస్ ఏవి శేషసాయిలతో కూడిన ధర్మాసనం దానిపై విచారణ చేపట్టింది. హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. చట్ట సవరణలు చేయడానికి జీవో జారీ చేయడం సబబుగా లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
తెలంగాణా రాష్ట్ర అటార్నీ జనరల్ కె. రామకృష్ణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తూ రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టంలోని సెక్షన్స్ 100, 101 ద్వారా తెలంగాణా ప్రభుత్వానికి అవసరమయిన చట్ట సవరణలు చేసుకొనే హక్కు ఉందని, అందుకే 207 జీవోని జారీ చేయడం తప్పు కాదని వాదించారు. కానీ ఆ వెసులుబాటు ద్వారా ఒక్కసారి మాత్రమే చట్ట సవరణలు చేసే అధికారం తెలంగాణా ప్రభుత్వానికి ఉంటుందని పిటిషనర్ తరపున రఘునందన రావు వాదించారు. జి.హెచ్.ఎం.సి. చట్టంలోని సెక్షన్ 5(1) ఏ ప్రకారం, ఒక ఎమ్మెల్సీ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కానీ గవర్నర్ చేత నామినేట్ చేయబడినా గానీ, నామినేషన్ వేసే సమయానికి అతనికి గ్రేటర్ హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంటేనే ఎక్స్ అఫీషియో గా మేయర్ ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉంటుందని, కానీ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అయినా ఓటు వేయడం ఆ చట్ట విరుద్దం అవుతుందని వాదించారు. ఆ ప్రతిబంధకాన్ని అధిగమించేందుకే తెలంగాణా ప్రభుత్వం తనకు అధికారం లేకపోయినా చట్ట సవరణ చేస్తూ 207 జీవోని జారీ చేసిందని, కనుక దానిపై స్టే ఇవ్వాలని రఘునందన రావు కోర్టుని కోరారు.
దీనిపై ఈరోజు కూడా కోర్టులో వాదోపవాదాలు కొనసాగాయి. ఇటువంటి కేసులలో గతంలో ఎప్పుడయినా సుప్రీం కోర్టు తీర్పులున్నట్లయితే వాటిని కోర్టుకి సమర్పించవలసిందిగా అటార్నీ జనరల్ ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.