ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికీ హైకోర్టు నుంచి చీవాట్లు తప్పడం లేదు. ఎన్నికలు ఎవరు నిర్వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర యంత్రాంగానికి ఉంది. దీనికి కారణం.. ఎన్నికల నిర్వహణంలో ఎంత గందరగోళం జరుగుతున్నా.. అక్రమాలకు పాల్పడుతున్నా.. ఫిర్యాదులు చేస్తున్నా.. పట్టించుకునేవారే లేరు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందో .. ఎవరికీ తెలియడం లేదు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో… విచారణలో న్యాయమూర్తులు.. ఎస్ఈసీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈసీ పని చేయడం లేదని.. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమరంలో పూర్తి స్థాయి ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. పెద్దగా సమయం ఇవ్వకుండా హడావుడిగా నిర్వహించడంతో పాటు.. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికలు జరుగుతున్నట్లుగా వీడియోలు బయటకు వస్తున్నాయి. కొంత మంది ప్రముఖ నేతలపైనా హత్యాయత్నాలు జరిగాయి. అయినప్పటికీ.. ఎస్ఈసీ కానీ… పోలీసులు కానీ నిమిత్త మాత్రంగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు కానీ… చేతలు మాత్రం… బయట కనిపించడం లేదు. అనేక చోట్ల పోలీసులు నిమిత్త మాత్రులయ్యారు. కొన్ని చోట్ల వైసీపీ నేతల కోసం.. వారే బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.
తాము చేసిన ఫిర్యాదులు.. ఎస్ఈసీ స్పందించకపోవడం వంటి అంశాలపై పిటిషనర్లు హైకోర్టుకు ఆధారాలు సమర్పించడంతో.. ఎస్ఈసీ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యకం చేసింది. గతంలో కోడ్ అమలులో లేనందున తాము ఏమీ చేయలేమని ఎస్ఈసీ హైకోర్టు ఎదుట వాదించింది. అయితే ఇప్పుడు.. కోడ్ అమలులో ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీన్నే హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది. హైకోర్టు సమాచారం పంపింది కాబట్టి.. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొసమెరుపేమిటంటే.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత… తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై వచ్చిన ఓ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు.. చీరలు పంచినందుకు…ఓ రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించారు.