సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న చైర్మన్, డైరక్టర్లు సంస్థను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని.. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ.. సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గుర్నాధంను అరెస్ట్ చేశారు. తర్వాత ప్రభుత్వం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ జీ.ఓ.నెం.19ని విడుదల చేసింది. సంగం డెయిరీలో పలు ఆర్ధిక, పాలనాపరమైన అవకతవకలను ఏసీబీ గుర్తించిందని, ప్రాధమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయని జీ.ఓలో పేర్కొన్నారు.
ఈ జీవో చట్ట విరుద్ధమని చెబుతూ.. హైకోర్టులో సంగం డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ వేశారు… ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు… నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. సంగం డెయిరీ డైరక్టర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రోజువారీ వ్యవహారాలను.. వారే చూసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో… ఏసీబీ సోదాలపైనా… సంగం డెయిరీ న్యాయవాదాలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రైవేటు వ్యక్తులను తీసుకు వచ్చి సోదాల పేరుతో మార్కెటింగ్ డేటా చోరీ చేస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు.. ఎఫ్ఐఆర్లో నమోదైన అంశాలు తప్ప.. ఇతర విషయాల్లో సోదాలు చేయవద్దని తీర్పు ఇచ్చింది. అయితే.. తీర్పు కాపీ అందలేదనే పేరుతో సర్వర్లలో చొరబడి ప్రైవేటు వ్యక్తులతో సోదాలు చేశారు ఏసీబీ పోలీసులు. ఈ సందర్భంగా.. రోజువారీ కార్యకలాపాల సమాచారం హ్యాక్ అయిందని.. సంగం డెయిరీసైబర్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది.