పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ విషయంలో.. హైకోర్టు స్టే ఎత్తి వేసింది. కొత్తగా.. రూ. ఎనిమిది వందల కోట్లు తక్కువకు పనులు చేసేందుకు రివర్స్ టెండర్ వేసిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి హైకోర్టు అవకాశం కల్పించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే.. పాత కాంట్రాక్టర్ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీని తప్పించిన ఏపీ సర్కార్.. వెంటనే.. రివర్స్ టెండర్లను పిలిచింది. తమను తప్పించడంపై.. నవయుగ సంస్థ కోర్టుకెళ్లింది. అయితే.. నవయుగ సంస్ధ పోలవరం ప్రాజెక్టు పనులపై కోర్టులో పిటిషన్ వేయలేదు. ఒక్క విద్యుత్ కేంద్రం టెండర్లపైనే పిటిషన్ వేసింది. అయితే.. ఏపీ సర్కార్.. అటు పోలవరం మిగిలిన పనులు… విద్యుత్ కేంద్రం కలగలపి… రివర్స్ టెండర్లు పిలిచింది.
దీంతో.. కోర్టు స్టే వెకేషన్ ఉత్తర్వులు కూడా.. రెండింటికి వర్తించే అవకాశం ఉందని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనులు గత ఐదు నెలలుగా నిలిచిపోయాయి. వరదల సమయంలో పనులు జరగవని ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పుడు..కూడా మరో రెండు నెలల పాటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. మేఘా సంస్థతో రివర్స్ టెండరింగ్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఇలా చేసుకోవాలంటే.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ పర్మిషన్ తీసుకోవాలి. గత పీపీఏ సమావేశంలో జరగాల్సిన పనులకు.. రివర్స్ టెండర్లో పిలిచిన పనులకు మధ్య తేడాను గుర్తించారు. ఈ క్రమంలో.. పీపీఏ వెలిబుచ్చే సందేహాలను క్లియర్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.
అది పూర్తయిన తర్వాత… మేఘా కంపెనీ పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత భారీ మెషినరీ అవసరం. వాటిని తెప్పించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. న్యాయపరంగా పోలవరం ప్రాజెక్టులు అడ్డంకులు తొలగినట్లుగా భావించవచ్చు. నవంబర్లో పనులు ప్రారంభించి.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మొదటి అడ్డంకిని అధిగమించినట్లే..!