మొదటి విడత కరోనా వేవ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి పడిన అక్షింతలు అన్నీ ఇన్నీ కావు. కరోనాకు సెకండ్ వేవ్ వచ్చినట్లుగా ఈ విషయంలో హైకోర్టు నుంచి కూడా… తెలంగాణ సర్కార్‌కు సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లుగా ఉంది. కరోనా టెస్టింగ్ విషయంలో తెలంగాణ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది.గత విచారణలో నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో.. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై ప్రభుత్వ నివేదికను అందించారు. అయితే స్కూళ్లపై నియంత్రణ పెట్టిన ప్రభుత్వం.. బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
రాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టారని .. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలపై వెంటనే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని.. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాలని స్పష్టం చేసింది. 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తే..మధ్యాహ్నానికే హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ వేగం హైకోర్టును ఇంప్రెస్ చేయలేదు. నివేదికను పరిశీలించి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ విచారణ జరుపుతున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో సులువుగా అర్థమవుతోందన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. సోమేష్ కుమార్ ఉదయం వరకూ అధికారిక విధుల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. ఓ వైపు.. కరోనా టెస్టులు సరిగ్గా చేయడం లేదని కోర్టు అక్షింతలు వేయడం..మరో వైపు ప్రభుత్వ అధికార యంత్రానికి బాస్ లాంటి సోమేష్ కుమార్‌కు కరోనా సోకడం.. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.