హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ పోలీస్ విభాగంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే దర్యాప్తు అధికారిని తప్పించాలని ఆదేశించింది. కేసును నీరుగార్చుతున్నారంటూ మండిపడింది. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. కేసు నమోదైనా చర్యలు తీసుకోవటంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని, అరెస్టులు జరగకపోవటానికి కారణాలేంటని అడిగింది. సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవటంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారని అడుగుతూ, ఈ మొత్తం వ్యవహారంలో తమకు కొన్ని అనుమానాలున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు డబ్బులు వెనక్కు ఇప్పిస్తామని పేర్కొంది. ఆస్తుల వేలాన్ని 15 రోజుల్లో ప్రారంభించాలని, లేదంటే చర్యలు తప్పవని ఆదేశిస్తూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.