శరవేగంగా జరుగుతున్న తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకూ కూల్చివేతలు ఆపాలని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు నిలిపివేయాలంటూ.. చిక్కుడు ప్రభాకర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రావడానికి ముందే కేసీఆర్ పేరుతో ఓ ప్రకటన మీడియాకు వచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత సందర్భంగా.. మసీదుకు.. ఆలయానికి అనుకోకుండా.. డ్యామేజ్ జరిగిందని.. ప్రభుత్వ ఖర్చుతోనే.. మళ్లీ పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తామని ఆ ప్రకటన సారాంశం. ఆ తర్వాత కాసేపటికే.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. దీంతో.. ఇప్పటి వరకూ జరిగిన కూల్చివేతలతో ఆపేయాల్సిన పరిస్థితి.
నాలుగు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేతను… శరవేగంగా నిర్వహిస్తోంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ దగ్గరుండి కూల్చివేత పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. సచివాలయానికి వెళ్లే దారిని కూడా మూసేసి కూల్చివేత పనులు చేస్తున్నారు. ఉదయం అంతా.. కూల్చివేయడం.. రాత్రి పూట శిథిలాలను తొలగించడం చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మొత్తం కూల్చివేతల్ని పూర్తి చేయాలనుకున్న సమయంలో హఠాత్తుగా.. హైకోర్టు బ్రేక్ వేయడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయినట్లయింది.
నిజానికి సీఎం కేసీఆర్ ఏపీ నుంచి… భవనాలు చేతికి అందిన సమయంలోనే … కూల్చివేతకు ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఏడాది నుంచి ఆ నిర్ణయం కోర్టు వివాదంలో పడింది. చివరికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో.. శరవేగంగా.. కూల్చివేతలు ప్రారంభించి.. మరో ఇబ్బంది రాకుండా… సుప్రీంకోర్టులో.. కూడా కేవియట్ వేయించేలా వ్యూహం సిద్ధం చేసుకుని.. కూల్చివేతలు ప్రారంభించారు. కానీ.. మరోసారి హైకోర్టు నుంచే… స్టాప్ ఆర్డర్స్ వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.