కర్ణాటక సర్కార్ భవితవ్యం ఎటూ తేలలేదు. రోజంతా.. అసెంబ్లీలో ఉత్కంఠ కొనసాగింది. పదే పదే వాయిదాలు పడుతూ… వచ్చింది. చివరికి… మళ్లీ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు.. విశ్వాస పరీక్షపై సభను నడపాలని స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయించారు. అయితే.. కర్ణాటక అసెంబ్లీలో రోజంతా.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తరహాలో ఉత్కంఠ ఏర్పడింది. ఉదయం సభ ప్రారంభమయ్యే సరికి.. ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. వీరిలో పదిహను మంది కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులతో పాటు ఓ బీజేపీ ఎమ్మెల్యే, బీఎస్పీ ఎమ్మెల్యే గైర్హాజరు అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ జరిగితే.. కుమారస్వామి సర్కార్ కూలిపోవడం ఖాయం. అయితే… అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్ సభ్యులు పదే పదే గందరగోళం సృష్టించారు. నిన్నటి వరకు కాంగ్రెస్ క్యాంప్‌లో ఉన్న శ్రీమంత్ పాటిల్ అనే ఎమ్మెల్యే.. తెల్లవారే సరికి.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనను బీజేపీ కిడ్నాప్ చేసిందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. దీనిపై స్పీకర్.. విచారణకు ఆదేశించారు.
ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో మాట్లాడాలని ఆదేశించారు. రోజంతా.. ఆ ఎమ్మెల్యే ఫోటోలతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పాటిల్‌ను బలవంతంగా తరలించారని తేలితే.. ఎమ్మెల్యేలందరికీ భద్రత కల్పించాలని డీజీపీని కోరుతానని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే.. బీజేపీ సభ్యులు మాత్రం.. వెంటనే ఓటింగ్ కు పట్టుబట్టారు. పదే పదే నినాదాలు చేశారు. పలు మార్లు పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. స్పీకర్ ఓటింగ్ నిర్వహించేలా లేకపోవడంతో… గవర్నర్ ద్వారా బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఓ వైపు సభ నడుస్తూండగానే బీజేపీ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ వద్దకు వెళ్లింది. త్వరగా ఓటింగ్ జరిగేట్లు స్పీకర్‌కు సూచించాలని వినతిపత్రం ఇచ్చారు. వెంటనే.. గవర్నర్ కూడా.. స్పీకర్‌కు ఓ లేఖ పంపారు. ఇవాళే ఓటింగ్ నిర్వహించాలని అందులో సూచించారు. గవర్నర్ లేఖను సభలో చదివి వినిపించిన స్పీకర్ రమేష్‌కుమార్…. అందరి సహాలు తీసుకుని.. చట్టప్రకారం చేయాల్సింది చేస్తానని ప్రకటించారు. దాంతో ఆయన గవర్నర్ సూచన పాటిచడం లేదని తేలిపోయింది.
వివాదంపై అడ్వకేట్ జనరల్ తోనూ.. స్పీకర్ సమావేశమైన న్యాయసలహా తీసుకున్నారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో.. రోజంతా గందరగోళంగా నడిచిన కర్ణాటక అసెంబ్లీని చివరకు.. రేపటికి వాయిదా వేశారు. అయితే బీజేపీ సభ్యులు మాత్రం సభలోనే కూర్చొని నిరసన తెలిపారు. రాత్రికి సభలోనే పడుకుంటామంటూ బీజేపీ సభ్యులు ప్రకటించారు. సభలో జరిగిన అనూహ్య పరిణామాల్లో బీజేపీ నేత శ్రీరాములు.. .. కాంగ్రెస్ నేత శివకుమార్ తో అదే పనిగా చర్చలు జరుపుతూ కనిపించారు. దీంతో శ్రీరాములుకు శివకుమార్ డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఈ కర్ణాటక హైడ్రామా శుక్రవారం కూడా కొనసాగనుంది.