మగధీర వంటి భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ సినిమా తీశాక, మర్యాద రామన్న వంటి చిన్న సినిమా తీశాడు రాజమౌళి. ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ బాహుబలి తర్వాత కూడా అదే విధంగా చిన్న సినిమా తీయాలనుకున్నాడు. గ్రాఫిక్స్ అవసరం లేని కథ రాయమని మా నాన్నగారికి చెప్పానని మీడియాతో పలు సందర్భాల్లో చెప్పాడు. ఎమోషనల్ డ్రామా తరహా సినిమా చేయాలనేది రాజమౌళి ప్లాన్. కానీ, అతడు అనుకున్నదొక్కటి… అయినది మరొకటి. బాహుబలి రెండు పార్ట్స్ బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రాజమౌళి, ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా సినిమా తీయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో గ్రాఫిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందట. ఇటీవల హీరోలు ఇద్దరూ విదేశాలు వెళ్ళింది ఫోటోషూట్ కోసం కాదు… యాక్షన్ గ్రాఫిక్స్ వర్క్ మీద అని సమాచారమ్.
ముందు ఇద్దరు హీరోలతో చిన్న సినిమాగా రాజమౌళి చేయాలనుకున్న కథ, ఇప్పుడు కొంచెం కొంచెం పెద్దగా మారి భారీ సినిమాగా తయారైంది. ముందు మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలనుకున్న షూటింగ్ డేస్ కాస్తా పెరిగాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసేసిన రాజమౌళి, ఇప్పుడు డైలాగ్ వెర్షన్ వర్క్ మీద కూర్చుకున్నారు. నవంబర్ నెలలో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కలిపి ఏడాదిలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. రిలీజ్ కూడా వచ్చే ఏడాది ఉండదు. 2020లో విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నారట!