భిన్న భావజాలాల వేదిక గా వున్న విశ్వవిద్యాలయాల స్ధితిగతుల్ని వాటి అవసరాన్ని లోపల వున్నవారు బయట వున్నవారు సరిగా అర్ధం చేసుకోకపోవడం వల్ల కూడా వైషమ్యాలు మరింత పెరుగుతున్నాయి. ఏవిద్యాలయంలో అయినా స్తోమత గల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు వుండే ఆత్మవిశ్వాసం, ధీమా, భరోసా సాంఘికంగా అణగారి కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలకు వుండదు. సామాజిక వివక్షవల్లా, పేదరికం వల్లా ఏర్పడే న్యూనతా భావమే ఇందుకు మూలం. దీన్ని తొలగించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా యుతమైన వాతావరణంలో విద్యలు నేర్చుకునే వాతావరణం కల్పించడానికే వెనుకబడిన వర్గాల పిల్లలకు ఆర్ధిక రాయితీలు, అడ్మిషన్ సమయంలో వెయిటేజి మార్కలు ఇవ్వడం ప్రభుత్వ విధానం.
ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు భావప్రకటనా స్వేచ్ఛే! విద్యా, జ్ఞాన, విజ్ఞానాల ఆలయాలైన విశ్వవిద్యాలయాలే భిన్నభావజాలాలకు కూడా చర్చావేదికలు. వీటిద్వారానే ప్రజాభిప్రాయాలు రూపొందుతాయి. తీర్చిదిద్దు కుంటాయి. అటువంటి ఓపెన్ ఆప్షన్ ని తాత్కాలికమైన రాజకీయప్రయోజనాలకు మూసిపెట్టడానికి అధికారంలో వున్నవారు పవర్ ను దుర్వినియోగం చేయడం దుర్మార్గం!
సిలబస్ ను మార్చేయబోతున్నారు. ఆలీఘఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం పేరు మార్చెయ్యడానికి సిద్దమైపోయారు. మార్పుతప్పకానే కాదు. అయితే అది పారదర్శకంగా జరగాలి. ప్రజాస్వామ్య దృకపధంతో జరగాలి. అధికారం వుందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే నిరసనలూ ఘర్షణలూ తప్పవు.
భావసారూప్యత గల విద్యార్ధుల సమూహాల ఐక్యత ఉద్యమాలకు దారితీస్తోంది. సాంఘిక ఆర్ధిక నేపధ్యాల నుంచే భావసారూప్యతలు కలుస్తున్నాయి. ఈ భూమిక అన్ని జాతీయ విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలాల విస్తరణకు దోహదపడుతోంది. అన్ని రాజకీయపార్టీల అనుబంధ విద్యార్ధి సంఘాలూ యూనివర్సిటీ పై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. ఘర్షణలు, కొట్లాటలు జరుగుతూనే వున్నాయి. అక్కడక్కడా హత్యలు కూడా జరిగాయి. అయితే నేరుగా కేంద్రమంత్రులే జోక్యం చేసుకుని గొడవ పెంచిన దాఖలాలు గతంలో దాదాపు లేవు.
దేశాన్ని కుదిపేస్తున్న కన్హయ్య కుమార్ అరెస్టు, వేముల రోహిత్ ఆత్మ హత్య సంఘటనల్లో పెద్దల అనుచిత / మితిమీరిన జోక్యాల వల్లే తప్పులు జరిగాయి.
ఒక నకిలీ ట్వీట్ ప్రభావం వల్ల కేంద్ర హోమ్ మంత్రి, ఒక నకిలీ వీడియో క్లిప్ వల్ల ఢిల్లీ పోలీస్ కమీషనర్ తొందరపడి ఢిల్లీ లోని జెఎన్ యు విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. హైదరాబాద్ యూనివర్సిటీ వేసిన వెలి శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ విషయంలో కేంద్రం నియమించిన కమిటీ రోహిత్, మరోనలుగురికి బహిష్కారం శిక్ష విధించిన యూనివర్సిటీ తప్పు పట్టింది. పోలీసులను యూనివర్సిటీ అధికారులను వారి పని వారే చేసి వుంటే న్యాయమే జరిగి వుండేది. దేశద్రోహుల మీద చర్య తీసుకోవాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఉత్తరం రాయడం, దానిపై చర్యలు ఏమయ్యాయని మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఐదు రిమైండర్లు ఇవ్వడం రోహిత్ తదితరుల బహిష్కరణకు దారితీశాయి.
కన్హయ్య కుమార్ విషయంలో సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రే రంగంలో దిగారు. పోలీసులు ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. ఇదేసందర్భంలో కన్హయ్య తదితరులపై దాడులు చేసిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్తు కార్యకర్తల మీదా, ఒక బిజెపి ఎమ్మెల్యే మీదా కూడా కేసులు నమోదయ్యాయి. వారంతా స్వేచ్ఛగా తిరుగుతూనే వున్నారు. బిజెపి అండ కారణంగానే వారిని పోలీసులు అరెస్టు చేయడం లేదని ఎవరికైనా అర్ధమైపోతుంది.
అఫ్జల్ గురు పై నేరవిచారణ నిరాపేక్షణీయంగా, పరిపూర్ణంగా జరగలేదని సిటింగ్ జడ్జిలే వ్యాఖ్యానించారు. అఫ్జల్ గురు ఉరిని విమర్శించి ఖండించిన పిడిపి పార్టీతో బిజెపి పొత్తుతో జమ్ము కాశ్శీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఈ నేపధ్యంలో అఫ్జల్ గురు పై చర్చజరుగుతూనే వుంది. దేశద్రోహానికీ, దేశద్రోహం నేరం మీద ఉరితీయబడిన వ్యక్తి పై చర్చకూ చాలా తేడావుంది. ఇదంతా బిజెపికో ఆపార్టీ విద్యార్ధి యువజన విభాగాలకో తెలియనిది కాదు. విశ్వవిద్యాలయాల్లో తమ పత్యర్ధి వర్గాల క్రియాశీలతను సహించలేకపోతున్న ఫలితమే వారు నేరుగా పెద్దల్ని రంగంలోకి దింపడానికి మూలం.
జాతీయతవేరు, హిందూత్వం వేరు.వ్యక్తి అంతరంగ జీవనానికి సంబంధించిన నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక విధానాలను నిర్దేశించేదే హిందూధర్మం, హిందూమతం…భారతీయులందరూ ఈ ధర్మాన్ని మతాన్ని గౌరవిస్తారు..సామరస్యంతో వుంటారు. బిజెపి అధికారాన్ని చూసుకున్ సంఘ్ పరివారం ” నచ్చనివారు పాకిస్ధాన్ వెళ్ళిపోండి అనేవరకూ తెగబడటమే సామరస్యాన్ని దెబ్బతీస్తోంది. ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే, నిరసిస్తే చర్చకు సిద్ధం కాకుండా అసహనాన్ని చూపిస్తున్నారు.
దేశద్రోహం వేరు, సంఘ్ పరివార్ భావజాలాన్ని వ్యతిరేకించడం వేరు. కన్విన్స్ చేయడమో, కన్విన్స్ అవ్వడమో తప్ప ప్రజాస్వామ్యంలో ఎదుటి పక్షాన్ని అధికారంతో అణచివేసే స్ధితికి చోటేలేదు. ఇలాంటి దమననీతి ది తాత్కాలికంగా పై చేయి కావచ్చు. కాని ప్రజలు శాశ్వతంగా ఆమోదించరు. అదే భారతదేశపు సంస్కృతి, నాగరికత, ఔన్నత్యం!