ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా లేదనేది కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాజధాని శంకుస్థాపనకు రాబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఒక నిర్మాణాత్మకమైన ప్యాకేజీని ప్రకటిస్తారని తెలుస్తోంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధి సహాయం అనే అన్ని అంశాలనూ జోడించి ప్యాకేజీ రూపొందుతున్నట్టు సమాచారం. ఏపీకి సంబంధించిన పూర్తి సమాచారం పంపాలంటూ కొన్ని రోజుల క్రితం నీతి ఆయోగ్ అన్ని శాఖలకు ఓ సర్క్యులర్ పంపింది. ఏపీకి ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత స్థితి, వగైరా వివరాలను ఆయా శాఖలు నీతి ఆయోగ్ కు పంపాయి. వాటి ఆధారంగా ఓ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఏపీని అభివృద్ధి చేయడానికి కేంద్రం ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే ఏపీలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, ఇతర హామీలను కేంద్రం నిలబెట్టుకుంది. నిధులకు సంబంధించి దశల వారీగా విడుదల చేసేలా మోడీ ప్యాకేజీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏపీకి ముఖ్యంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం అవసరం. ఈ విషయంలోనూ మోడీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి అయిన తర్వాత తొలిసారిగా వస్తుండటం, అందునా రాజధాని శంకుస్థాపన తన చేతుల మీదుగా జరుగుతుండటంతో ప్రజలను నిరాశ పరచరాదని మోడీ భావిస్తున్నారని సమాచారం. కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఏపీకి చేయాల్సిన సహాయం గురించి పలు విషయాలను మోడీకి వివరించినట్టు భోగట్టా.
ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్యాకేజీ దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. నీతి ఆయోగ్ అన్ని అంశాలనూ సమగ్రంగా విశ్లేషించి ప్రధానికి నివేదికను సమర్పించినట్టు సమాచారం. బీహార్ కంటే మెరుగైన ప్యాకేజీయే ఇస్తామని ఇటీవల కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు సంకేతాలిచ్చారు. వాటికి అనుగుణంగానే మోడీ అమరావతి శంకుస్థాపన సభలో ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల సమాచారం.