ఏపీలో రాజధాని మార్పు ఎపిసోడ్‌కు సంబంధించి రెండు అంకాలు ముగిశాయి. ఇంకోటి మిగిలివుంది. జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి ఇదివరకే నివేదిక ఇచ్చేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిన్న నివేదిక ఇచ్చింది. అందులో ఏముందో ప్రభుత్వమే ప్రజలకు తెలియచేసింది. మీడియా ద్వారా బీసీజీ నివేదికలోని ప్రతి విషయం ప్రజల దగ్గరకు, పార్టీల వద్దకు చేరింది. ఇది పేరుకు బీసీజీ నివేదిక అయినప్పటికీ ప్రభుత్వం తనకు కావల్సిన రీతిలో రియించుకుంది కాబట్టి ఇది ప్రభుత్వ నివేదికేనని చెప్పుకోవచ్చు. ఇక మూడో అంకం ప్రభుత్వం పది మంది మంత్రులతో, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదిక. ఇదే చివరి దశ. జీఎన్‌రావు నివేదిక, బీసీజీ నివేదికను ఈ కమిటీ అధ్యయనం చేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది.
ఈ కమిటీ ఈ నెల 17న ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ తెల్లవారే అంటే 18న అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అందులో మూడు రాజధానులకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేయిస్తుంది. మెజారిటీ ఎమ్మెల్యేలు వైకాపా వారే కాబట్టి ఆమోదముద్ర పడదనే సమస్యే లేదు. హైపవర్ కమిటీ అనేది నామ్కేవాస్తే అంటే నామమాత్రపు కమిటీ మాత్రమే. ఈ కమిటీ అందించే నివేదిక బీసీజి నివేదికకు నకలుగా ఉంటుందనడంలో సందేహంలేదు. మంత్రులు, అధికారులతో కూడిన కమిటీ బీసీజీ నివేదికకు భిన్నంగా నివేదిక ఇవ్వదు కదా. యథాతథంగా బీసీజీ నివేదికను కాపీ కొడితే బాగుండదు కాబట్టి ఇబ్బంది కలగని రీతిలో చిన్న చిన్న మార్పులు చేస్తారేమో…! అవి అంతగా కీలకమైనవి కాకపోవచ్చు.
అసెంబ్లీలో మూడు రాజధానులు తీర్మానం ఆమోదం పొందిన తరువాత అనుకున్నట్లుగానే రాజధాని తరలించడమేనా? లేదా ప్రభుత్వానికి ఏమైనా అడ్డంకులు కలుగుతాయా? ఇక్కడే రాజధాని కథ మలుపు తిరిగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ఈ అడ్డంకులు ఏవంటే ఒకటి…కేంద్ర ప్రభుత్వం, రెండు…హైకోర్టు. ఈ రెండూ కథలో ఎంటరైతే రాజధాని తరలింపు వెంటనే జరగదని అంటున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు. ఉంటే తప్పేంటి అని సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చేసిన ప్రకటన నుంచి నిన్నటి బీసీజీ నివేదిక వరకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు. కాకపోతే కేంద్రం జోక్యం చేసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సివుంది. ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం అన్ని పరిణామాలను గమనిస్తోందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతుండగా, కేంద్ర జోక్యం చేసుకోదని, ఈ వ్యవహారంతో దానికి సంబంధం లేదని ఎంపీ, ఐదు రాష్ట్రాల అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా రాష్ట్రానికి వచ్చి చెప్పిపోయారు. తాను చెప్పందే ఫైనల్ అన్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాను చెప్పిందే (రాజధాని అమరావతిలోనే ఉండాలని) పైనల్ అన్నారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని, ఏదైనా అడిగి సలహాలు, సూచనలు ఇస్తుందని చెప్పారు. అంటే ఫలాన చోటనే రాజధాని ఉండాలని కేంద్రం నిర్దేశించలేదు. తెలంగాణకు చెందిన రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రాజధాని విషయంలో కేంద్రం కల్పించుకోదన్నారు.
రాజధాని మారిస్తే కేంద్రం నిధులు ఇవ్వదని కొందరు బీజేపీ నాయకులు చెబుతున్నారు. రాజధాని ఎక్కడున్నా విభజన చట్టం ప్రకారం నిధులివ్వాల్సిందేనని వైకాపా నాయకులు అంటున్నారు. ఇక అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. భూములిచ్చిన వారికి పూర్తి న్యాయం చేస్తామని మంత్రులు చెబుతున్నారు. కాని ఇప్పటివరకు స్పష్టమైన విధానం ప్రకటించలేదు. మరి అమరావతిలో రైతుల సమస్య, కాంట్రాక్టర్ల సమస్య, ఇంకా అనేక ఇతర అంశాలు పరిష్కారం కాకుండా రాజధానిని తరలించే వీలుందా? ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు అడ్డుకోలేదని, నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తుందని చెబుతున్నారు. కేంద్రం, కోర్టు అడ్డు తగిలితే రాజధాని తరలింపు ఇప్పట్లో కాకపోవచ్చేమో…!