రజనీకాంత్ సినిమా అంటే.. టాలీవుడ్‌లోనూ బోల్దంత హంగామా మొదలైపోతుంది. రజనీ సినిమా హిట్టయితే – ఓ అగ్ర హీరో సినిమా వసూలు చేసినంత కలక్షన్లు వచ్చిపడిపోతాయి. అయితే అందంతా హిట్టయితేనే. అటూ ఇటూ అయితే మాత్రం కొంపలు కొల్లేరవుతాయి. అందుకే తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనేటప్పుడు నిర్మాతలు ఆచితూచి స్పందిస్తుంటారు. రజనీకాంత్ తాజా సినిమా ‘కాలా’పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదో గ్యాంగ్ స్టర్ సినిమా అని అర్థమవుతూనే ఉంది. రజనీ స్టిల్స్, స్టైల్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. అయితే టీజర్ మాత్రం ఆ స్థాయిలో లేకపోయేసరికి రజనీ ఫ్యాన్సే కాదు, తెలుగు బయ్యర్లు కూడా నిరాశ పడ్డారు. పైగా ‘కబాలి’ తీసిన పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. అందుకే… తెలుగులో మార్కెట్ బాగా స్లో అయ్యింది. `కాలా`కి సంబంధించిన తెలుగు రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. తమిళ నిర్మాతలు రూ.35 కోట్లు డిమాండ్ చేస్తున్నార్ట. దిల్‌రాజు లాంటి తలపండిన డిస్టిబ్యూటర్లు బేరాలాడీ ఆడీ విసిగిపోయారు. దాంతో ‘కాలా’ తెలుగు రైట్స్ అలానే ఉండిపోయాయి. రూ.25 కోట్లకు కొనుక్కోవాలని కొంతమంది నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ కాలా నిర్మాతలు మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఏప్రిల్ 27న కాలా రిలీజ్ అవుతుందని ప్రకటించినా… ఇప్పుడు ఆ డేట్‌కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. డేట్ ఫిక్సయ్యాక ఆలోచిద్దాంలే అంటూ మనోళ్లు కూడా బాగా రిలాక్స్ అయిపోయారు.