థియేటర్లో వినోదం అనేది రోజు రోజుకీ మరింత ప్రియం అయిపోతోంది. టికెట్ రేట్లు పెరిగిపోవడం, పార్కింగు ఛార్జీలు తడిసి మోపెడు అవ్వడం ఒక ఎత్తయితే.. మల్టీప్లెక్స్‌లో ఆహార పదార్థాల ఖరీదు… ప్రేక్షకులపై భారాన్ని మరింత పెంచుతున్నాయి. కనీసం మంచినీళ్ల బాటిల్ కొనాలన్నా.. రూ.50 రూపాయలు తగ్గడం లేదు. ఇక పాప్ కార్న్లూ, ఇతర తినుబండారాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలతో థియేటర్లకు వెళితే.. జేబులు చిల్లులు పడడం ఖాయం. మల్టీప్లెక్సుల్లో తినుబండారాల పేరుతో జరుగుతున్న దౌర్జన్యం, దోపిడీల గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు బయట నుంచి తినుబండారాల్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రేక్షక వర్గం, వినియోగ దారుల సంఘాలూ గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై వివిధ కోర్టులు తీర్పు కూడా ఇచ్చాయి. వాటిలో చాలా వరకూ ప్రేక్షకులకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన కొత్త తీర్పు.. ప్రేక్షకులకు ఒకింత నిరాశకు గురి చేసేట్టు ఉంది. థియేటర్లలో ప్రేక్షకులు బయట నుంచి తినుబండారాలు తెచ్చుకోవొచ్చు అంటూ 2018లో జమ్మూ కశ్మీర్ కశ్మీర్ ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసం కొట్టి వేసింది. థియేటర్ అనేది ప్రైవేటు ఆస్తి కాబట్టి… అక్కడ థియేటర్ యాజమాన్యం షరతులు విధించే హక్కు ఉందని, తిను బండారాల్ని థియేటర్లో కొనాలో వద్దో నిర్ణయించుకొనే హక్కు.. ప్రేక్షకుడికి ఉన్నప్పుడు.. వాటిని ఎంతకు అమ్మాలో నిర్ణయించే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉందని తీర్పు ఇచ్చింది. అయితే.. ప్రతీ థియేటర్లోనూ తాగునీరుని ప్రేక్షకులకు ఉచితంగా అందించాలని ఆదేశించింది. చిన్న పిల్లలకు అవసరమైన తినుబండారాల్ని మాత్రం అనుమతించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో… మల్టీప్లెక్స్ నిర్వాహకుల దోపికీ కొత్త ఊతం వచ్చినట్టే అనిపిస్తోంది. ఇష్టమైతే కొనుక్కోండి లేదంటే.. లేదు అంటే.. అంటే ఇక మల్టీప్లెక్సుల ఇష్టారాజ్యం అన్నట్టే కదా..?