హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా ఇప్పుడు ఆకాశహర్మాల చుట్టూనే తిరుగుతోంది. ఒకరు యాభై అంటే.. మరొకరు అరవై అంతస్తులు అంటున్నారు. వన్ నుంచి మన్ హట్టన్ వరకూ అనేక పేర్లు పెట్టేస్తున్నారు. అల్ట్రా లగ్జరీ మోడల్స్ లో కట్టేస్తున్నారు. ఎంతో ఎత్తులో జీవిస్తే .. ఆ లైఫ్ స్టైల్ ఎంత అద్భుతం అని అనుకునేవారు పెరుగుతున్నారు. పై అంతస్తుల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిల్డర్లు వీరి ఆసక్తిని గమనించి రేట్లు పెంచేస్తున్నారు.
హైదరాబాద్‌లోని లగ్జరీ స్కైస్క్రాపర్లలో 15వ అంతస్థు నుంచి ధరలు పెరగడం ప్రారంభమవుతాయి. “ఫ్లోర్ ప్రీమియం” పేరుతో అదనపు ధరలు వసూలుచేస్తారు. ప్రతి 5-10 అంతస్థులకు ధరలు చదరపు అడుగుకు ఫ్లోర్ ప్రీమియంగా 100 నుండి 500 వరకూ పెంచుతున్నారు. కొన్ని లగ్జరీ ప్రాజెక్టుల్లో ఇంకా ఎక్కువ ఉంటోంది. ఒక ప్రాజెక్ట్‌లో కింది అంతస్తుల్లో. ధర చదరపు అడుగుకు 8,000 ఉంటే 20వ అంతస్తుకు అది పది వేర్ చేరవచ్చు. అక్కడ్నుంచి పెరుగుతూనే ఉంటుంది. ఎత్తైన అంతస్థులలో ఉన్న అపార్ట్మెంట్లు ప్రైవేట్ టెర్రస్, స్కై లాంజ్ కలిగి ఉంటాయి. వీటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ వాతావరణం కారణంగా ఎక్కువ మంది పై అంతస్తుల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కింది ఫ్లాట్లను తక్కువకే అమ్ముకుంటున్న సంస్థలు.. ఆ లోటును పై అంతస్తుల్లో ఫ్లోర్ ప్రీమియం ద్వారా భర్తీ చేసుకుంటున్నారు. అందుకే పై అంతస్తుల్లో ఇల్లు కొనే ముందు.. సాధారణంగా బిల్డప్ చెప్పే చదరపు అడుగు రేటు ప్రకారం బడ్జెట్ వేసుకోవద్దు. కనీసం మరో నలభై శాతం అధికంగా అవుతుంది. ఎత్తుకు ఎదగాలంటే ఇప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే.