సినిమానే అతి చవకైన వినోద సాధనం అని నిర్మాతలు చెబుతూ ఉంటారు. అది ఒకప్పటి మాట. నేల టికెట్ పది రూపాయలున్నప్పుడో.. రిజర్వుడు రూ.50 రూపాయలు ఉన్నప్పుడో చెప్పుకొన్న మాట. అయితే.. ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి. సినిమాకెళ్తే… ప్రేక్షకుడ్ని నిలువునా దోచేసుకొంటున్నారు. టికెట్ వంద.. పార్కింగ్ 20, ఇంట్రవెల్లో ఆకలేస్తే రూ.200.. ఇలా సినిమా అయ్యేసరికి సగటున రూ.300 ఖర్చువుతుంది. అదే ఫ్యామిలీతో వెళ్తే..?? కొత్త సినిమా వచ్చిందంటే.. ప్రేక్షకుడికి సంబరం. తొలిరోజే చూసేయాలన్న ఆత్రుత. దాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం థియేటర్ యాజమాన్యం పోటీ పడుతుంటుంది. బాహుబలి 2నే తీసుకోండి. బెనిఫిట్ షో రూ.2000 తగ్గలేదు. తొలిరోజు టికెట్ కొనాలంటే.. జేబులకు చిల్లు పడిపోవాల్సిందే. ఇప్పటికీ బ్లాక్ దందా నిర్విరామంగా సాగుతోంది. వీలైనంత త్వరగా సినిమా చూసేయాలన్నంత ఆత్రుత సామాన్య ప్రేక్షకుడిది. దాన్ని అడ్డంగా వాడుకోవాలన్న ఆశ మిగిలినవాళ్లది.
ప్రభుత్వం కూడా ‘మీ రేట్లు మీ ఇష్టం’ అంటూ గేట్లు తెరిచేసింది. కానీ.. ప్రేక్షకుల గోడు పట్టించుకోవడం లేదు. ఓ పెద్ద సినిమా వచ్చిందంటే టికెట్ రేటు ఎందుకు పెరగాలి?? అనేది సగటు ప్రేక్షకుడి ఆవేదన. భారీ బడ్జెట్ సినిమా తీస్తే.. మేం కూడా రెట్టింపు డబ్బులిచ్చి సినిమా చూడాల్సిందేనా?? అని అడుగుతున్నారు? టికెట్ ధర పెంచితే సినిమా చూడొద్దంటూ… సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా ప్రభుఏతా్వలు గమనించాల్సిన అవసరం ఉంది. థియేటర్లలో కనీస సదుపాయాలు ఉంటున్నాయా? మంచినీళ్లు దొరకుతున్నాయా? పార్కింగ్ సౌలభ్యాలేంటి? ఏసీ థియేటర్లలో నిజంగానే ఏసీ నడుస్తోందా? ఇవేం పట్టించుకోవడం లేదు. ప్రతీ థియేటర్కీ ఒకే రేటు ఎందుకు ఇవ్వాలి?? కనీస సదుపాయాలు లేనప్పుడు టికెట్ ధర పెరిగితే చెల్లించాల్సిన అగత్యం ఏమిటి? అనేది సగటు ప్రేక్షకుడి ఆవేదన. ఈ విషయంలో ప్రేక్షకులలోనూ చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. థియేటర్లో ఏసీ నడవకపోతే.. యాజమాన్యాన్ని నిలదీయాల్సిందే. కాంబో టికెట్ మాత్రమే అమ్ముతాం అంటే ప్రశ్నించాల్సిందే. ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ నిర్మాతల వైపు నుంచే కాకుండా.. ప్రేక్షకుడి కోణంలోంచీ ఆలోచించాలి. ఈ నిలువు దోపిడీని అరికట్టాలి.