ఉరుములేని పిడుగులా అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ప్లాన్డ్ గా చేశారా లేకపోతే అలా జరిగిపోయిందా అన్నది ఎవరికీ తెలియదు. అలాంటిదే శుక్రవారం అల్లు అర్జున్ విషయంలో చోటు చేసుకుంది. లంచ్ టైంకు ఇంటికి వచ్చిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లుగా చెప్పడంతో అర్జున్‌కే ఏం జరిగిందో అర్థం కాలేదు. అయితే ఆయన ధైర్యంగా పోలీసుల వెంట వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో తన పాత్ర పరిమితమని ఆయనకు తెలుసు. అందుకే క్వాష్ పిటిషన్ వేశారు.
అయితే అక్కడ్నుంచి ప్రారంభమైన డ్రామా అలా ఆలా సాగుతూ పోయింది. ఇక చంచల్ గూడ జైలుకు వెళ్లక తప్పదన్న స్థితిలో.. పోలీసులు ఆయనను జైలుకు తరలిస్తున్న సమయంలో హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ మధ్యలో ఆయనను పోలీస్ స్టేషన్ .. గాంధీ ఆస్పత్రి, నాంపల్లి కోర్టులో తిప్పారు. అనేక రకాల వాదనలు బయటకు వచ్చాయి. ఏ వాదనలు జరిగితేనేం ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో జైలుకు వెళ్లి ఉంటే మళ్లీ బెయిల్ పిటిషన్ వేసుకుని తెచ్చుకునేవరకూ జైల్లో ఉండాల్సి వచ్చేది.
అయితే ఇది అరెస్టు చేయాల్సినంత తీవ్రమైన కేసు కాదన్న అభిప్రాయం మాత్రం సినీవర్గాల్లో ఉంది. నాని, వంటి వాళ్లు నేరుగా ఈ అంశంలో స్పందించారు. అరెస్టు కరెక్ట్ కాదన్నారు. చిరంజీవి తో సహా అందరూ వెళ్లి అర్జున్ కుటుంబానికి సపోర్టుగా నిలబడ్డారు. అరవింద్ లాయర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరిగారు. త్రివిక్రమ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. దిల్ రాజు, బన్నీ నిర్మాతలు కూడా వచ్చి సపోర్టుగా నిలబడ్డారు.
మొత్తంగా ఆరు గంటల హైడ్రామా తర్వాత కేసు అర్జున్ విషయంలో సుఖాంతం అయింది. కానీ అసలు ఈ అరెస్టు వెనుక ఉన్న మోటివ్ ఏంటో మాత్రం ఈ నిర్ణయం తీసుకున్న వారికే తెలియాలి.