ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కు 3,54,803మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహరెడ్డి వెల్లడించారు.
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈఏపీ సెట్ కు హాజరయ్యే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎవరూ మెహందీ పెట్టుకోవద్దని, టాటూలు వేసుకోవద్దని తెలిపారు. మే 7, 8 తేదీలలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీం విద్యార్థులకు పరీక్షలు , మే 9,10,11వరుస తేదీలలో ఇంజినీరింగ్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. నిర్ణీత సమయానికి 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు.
పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు ఎవరూ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావోద్దని.. వాటికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎప్ సెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇతర పరీక్షలు ఉంటే తమను సంప్రదించాలని.. అలాంటి వారికి షిఫ్ట్ లో పరీక్ష రాసేందుకు ఛాన్స్ ఇస్తామని చెప్పారు.
మొదటిసారి బయోమెట్రిక్ తో ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.మొత్తం 15 బోర్డుల నుంచి ఎప్ సెట్ కు అప్లై చేసుకోగా.. అత్యధికంగా తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి 2 ,72,145మంది , ఏపీ ఇంటర్ బోర్డు నుంచి 69వేల మంది అప్లై చేసుకున్నారని చెప్పారు.