ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేసినా దాన్లో ఒక విజన్ ఉంటుంది అని చాలామంది అంటుంటారు! అయితే, ఈ మధ్య ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికలకు అధికార పార్టీ సంసిద్ధమౌతున్న లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం పనులు కంటే.. ఆ పనుల్ని తెలుగుదేశం చేస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రచారానికే పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమ అంతిమ లక్ష్యం ఇదే. అది టీడీపీ మంత్రులూ ఎమ్మెల్యేలూ నేతలూ నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇప్పుడు ఉన్నతాధికారులకు కూడా దాదాపు అలాంటి బాధ్యతల్నే అంతర్లీనంగా అప్పగించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.
ప్రస్తుతం జిల్లా కలెక్టర్లూ ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రజలను రెచ్చగొట్టేందుకు కొంతమంది చూస్తున్నారనీ, అలాంటి శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్లు ఇద్దామనే నిశ్చయంతో ఉన్నామనీ, ఈలోగా ప్రజల్లో విద్వేషాలు రేకెత్తించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి వారి ఆటలు సాగనీయకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని అధికారులకు సూచించారు. దీంతోపాటు పరిశ్రమలను అడ్డుకునే పరిస్థితి కూడా చూస్తున్నామనీ, ఇలాంటి అంశాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. వైశ్యుల మనోభావాలను దెబ్బ తీసిన కంచె ఐలయ్య, సభలు నిర్వహిస్తూ రెచ్చగొడుతున్న మరొకాయన.. ఇలాంటి వారిని అడ్డుకోకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
కుల, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులపై అప్రమత్తంగా ఉండటం వరకూ బాగానే ఉంది. కానీ, ‘పరిశ్రమలు అడ్డుకునేవారి’పై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంతకీ రాష్ట్రంలో అలా పరిశ్రమలు అడ్డుకుంటున్నది ఎవరు..? అభివృద్ధికి విఘాతంగా మారుతున్నారంటూ చెబుతున్న ఆ శక్తులు ఎవరు..? అందరికీ తెలిసిన విషయమే.. అది విపక్ష పార్టీ వైకాపా అని! కొన్ని పరిశ్రమల విషయంలోగానీ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలోగానీ ప్రతిపక్షంగా కొన్ని ఆరోపణలు చేసే హక్కు వారికి ఉంటుంది. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పాలక పక్షంగా టీడీపీది. వారి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన కర్తవ్యం అధికార పార్టీది. అంతేగానీ, ఆ బాధ్యతను ఉన్నతాధికారులకు అప్పగించేసి.. నిరసనలు వ్యక్తమైతే చర్యలు తీసుకోండి అంటూ, అధికార పార్టీ చేయాల్సిన పనులను అధికారులకు బదలాయిస్తే ఎలా..?
ఈ సందర్భంలో ముద్రగడ విషయాన్ని కూడా ఇన్ డైరెక్ట్ గా సీఎం చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేలోపు ఎలాంటి నిరసనలు లేకుండా చూడాలన్నారు. ఇది కూడా ప్రభుత్వ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కదా. రిజర్వేషన్ల విషయమై వీలైనంత త్వరగా నిర్ణయం తీసేసుకుంటే.. నిరసనలు ఎందుకుంటాయి..? చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అంశాలను కూడా శాంతి భద్రతల కోణం నుంచి డీల్ చేయాలంటూ అధికారులకు ఉద్బోధిస్తున్నట్టుగా ఉంది!