పాటకు ప్రాణం పల్లవి… అంటుంటారు. అయితే.. పాటగాళ్లూ ప్రాణమే. శంఖంలో పోసిన తరవాతే తీర్థం అయినట్టు, కొంతమంది గొంతులో పల్లవిస్తేనే పాటకు వాల్యూ ఉంటుంది. పెక్యులర్‌గా వినిపించే గొంతులకు మరింత డిమాండ్ ఉంటుంది. వాళ్ల పారితోషికాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు సిద్ద్ శ్రీరామ్ గొంతు కొత్తగా, వింతగా ఉంటుంది. అతనితో పాట పాడించుకోవాలన్నా ఖరీదైన వ్యవహారమే. తను ఒక్కో పాటకూ.. రూ.6 నుంచి రూ.8 లక్షల వరకూ ఛార్జ్ చేస్తాడు. జీఎస్టీ అదనం. తెలుగులో అత్యంత ఖరీదైన గాయకుడు అతనే. ఈమధ్య తన డిమాండ్ కాస్త తగ్గింది. మెనాటినీ వల్లో, లేదంటే భరించడం కష్టమనో… కొంతకాలంగా సిద్ద్ని పక్కన పెట్టారు సంగీత దర్శకులు.
సిద్ద్ తరవాత… కాస్త ఫ్రెష్‌గా, వినగానే ఎక్కేసేలా ఉండే గొంతు.. రామ్ మిరియాలది. ‘డీజే టిల్లు’లో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఆ పాట కోసమే జనాలు థియేటర్లకు వెళ్లారు. అట్లుంటది రామ్ మిరియాల గొంతంటే. తను కూడా కాస్త ఖరీదైన గాయకుడే. ఒక్కో పాటకూ రూ.2 నుంచి రూ.2.5 లక్షల పారితోషికం తీసుకొంటాడు. అలాగని ప్రతీ పాటా పాడేయడు. ముందు ట్యూన్ నచ్చాలి. ఆ తరవాత తన టెంపోకు సరిపోయేలా ఉండాలి. ఆ తరవాత బ్యానర్, హీరో.. ఇవన్నీ నచ్చితేనే పాట ఓకే చేస్తాడు. కొన్నిసార్లు ట్యూన్ తనే కట్టుకొంటాడు. దానికి అదనంగా ఛార్జ్ చెల్లించాల్సిందే. ఇటీవల ‘టిల్లు స్క్వేర్’లో తాను పాడిన పాట కూడా బాగా క్లిక్కయిన సంగతి తెలిసిందే.
అనురాగ్ కులకర్ణి లాంటి క్లాసిక్ వాయిస్ తో పాట పాడించాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలి. బాలు మరణానంతరం ఎస్.పి. చరణ్ గొంతుకు డిమాండ్ పెరిగింది. ఇది వరకు ఎస్.పి. చరణ్‌ని పక్కన పెట్టినవాళ్లంతా ఇప్పుడు పిలిపించుకొని పాటలు పాడించుకొంటున్నారు. బాలు పాడాల్సిన పాటలు కొన్ని చరణ్ ఖాతాలోకి వెళ్తున్నాయి. చరణ్ రెమ్యునరేషన్ ఒక్కో పాటకూ రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకూ ఉందని టాక్. ఫిమేల్ వాయిస్‌లో మంగ్లీ గొంతుకు మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ఫోక్ పాటలకు మంగ్లీ పెట్టింది పేరు. హుషారుగా పాడేస్తుంటుంది. తనతో పాటంటే రూ.2 లక్షలు చెల్లించాలి. తెలుగు పక్కన పెడితే.. దక్షిణాది ఫిమేల్ సింగర్స్ లో శ్రేయా ఘోషల్ టాప్ ర్యాంక్‌లో ఉంటుంది. తన ఛార్జ్ ఒక్కో పాటకూ రూ.5 లక్షలు.
అయితే పారితోషికాలకు తగ్గట్టే రాబడి కూడా ఉంటుంది. సిద్ద్ తో ఓ పాట పాడిస్తే… హీరో ఎవరు, బ్యానర్ అనేది ఏమిటో కూడా చూడకుండా ఆడియో కంపెనీలు కనీసం రూ.20 లక్షలు కట్టబెడతారు. మంగ్లీ, రామ్ మిరియాల పాటలకు యూ ట్యూమ్ లో మిలయన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. అందుకే వాళ్లు పాడిన సినిమాలకు ఆడియో రైట్స్ బాగుంటాయి. అందుకే నిర్మాతలు కూడా.. ఫామ్‌లో ఉన్న సింగర్స్ తోనే పాటలు పాడిస్తుంటారు.
అయితే వీళ్లలో కొంతమంది సీజనల్ స్టార్స్. ఓ సీజన్ వరకే వీళ్ల ప్రతాపం. మళ్లీ మరో కొత్త గొంతు వచ్చేంత వరకూ వీళ్ల ఆధిపత్యం నడుస్తుంది. ఆ తరవాత పక్కన పెట్టేస్తారు. సిద్ద్ శ్రీరామ్ ఇందుకు మంచి ఉదాహరణ. అప్పటి వరకూ వీళ్లు అడిగినంత పారితోషికం ఇస్తుంటారు.