రాజధానిని పరిపాలన కేంద్రంగా నిర్వహించాలనే దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలగపూడి గ్రామంలో తాత్కాలిక రాజధానికి ఉ.8-23కు శంకుస్థాపన చేసారు. ఆయన ఉదయం 8 గంటలకే శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకొన్నారు. ఆయనతో బాటు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దా ప్రసాద్,డీప్యూటీ సీఎం చినరాజప్ప, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పి.నారాయణ, పి.పుల్లారావు, యనమల రామకృష్ణుడు, అచ్చం నాయుడు, దేవినేని ఉమ మహేశ్వరరావు, కె. శ్రీనివాస్, మాణిక్యాలరావు, పీతల సుజాత, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, పలువురు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ లు, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, ఉన్నతాధికారులు,భూములు ఇచ్చిన రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.8.23 గంటలకి శంఖుస్థాపన చేసి, 8.36 గంటలకి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిష్కరించారు. 2018 నాటికి పూర్తి స్థాయి సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చెయ్యడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
శంఖు స్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో మాట్లాడుతూ “అ-అంటే అమరావతి అని భవిష్యత్తులో చదువుకునేలా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. ఈ నేలకు , ఈ గాలికి, ఈ ఊరికి, ప్రక్కన పారే కృష్ణమ్మకు, భూములిచ్చిన రైతులకు మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. అమరావతికి ఒక పవిత్రత ఉంది, ప్రపంచంలోని అన్ని ప్రదేశాలు, పవిత్ర స్థలాలు మక్కా, జెరుసలెం, తిరుపతి నుంచి మట్టిని, జలాలను తీసుకొని వచ్చాము. ప్రపంచంలోని 10 ఉన్నతమైన రాజధాని లో ఒకటిగా అమరావతిని నిర్మించి చూపుతాము. 2014 లో రాజధానికి చెందిన పనులుకోసం నిర్ణయం తీసుకొన్నాం. 2015, ఏప్రిల్ 1న పనుల కోసం శంకుస్థాపనకు శ్రీకారం చేప్పట్టాము. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా నిర్మాణాలు చేపడతాం.అంతర్జాతీయ ప్రమాణాలున్న సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు తదితర నిర్మాణాలు చేసి రాజధాని నగరాన్ని భవిష్యత్తుకు దిక్సూచిగా నిలపాలన్నదే నా ద్యేయం.” అని అన్నారు.
“ప్రపంచంలో 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత 65 శాతం మంది ఉన్న ఏకైక దేశం భారతదేశమే. నదుల అనుసంధానం చేయాలి. వర్ష జలాలను కాపాడుకోవాలి. 2022 నాటికీ దేశంలో మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా, 2029 నాటికీ దేశంలో అగ్రస్థానం లోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలుపుతాను. 2050 నాటికీ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే నా లక్ష్యం,” అని ముఖ్యమంత్రి అన్నారు.
“నాకు ఎటువంటి స్వార్థం లేదు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాను. మంగళవారం న్యూఢిల్లీ వెళ్లి సిస్కో చైర్మన్ ను కలిసి, అక్కడనుంచి ముంబైకి వెళ్లాను. అక్కడి నుంచి విశాఖపట్నంకు వెళ్ళాను. ప్రతి ఒక్క అవకాశం వినియోగించుకొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం,” అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర పరిపాలన కోసం విజయవాడకు తరలివచ్చే అధికారులు, సిబ్బంది కోసం వసతులు ఏర్పాటు చేయాలనుకొంటే స్థానిక గృహ యజమానులు ఇంటి అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు..కొంచెం ఆలోచించుకొమ్మని ముఖ్యమంత్రి విజయవాడ, గుంటూరు నగరాలలోని గృహ యజమానులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.
ఈ భవన నిర్మాణాలే మున్ముందు శాశ్విత భవనాలుగా రూపుదిద్దుకొంటాయన్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఒక్కో అంతస్తు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున రెండు అంతస్తులు కలిపి మొత్తం ఆరు లక్షల చదరపు అడుగులలో నిర్మించబోతున్నట్లు తెలిపారు. పలోంజి, ఎల్ అండ్ టీ సంస్థలు రెండూ కలిసి ఈ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేస్తాయని తెలిపారు. నాలుగు నెలల కాల వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చెయ్యడం జరుగుతుందని తెలిపారు. గ్లోబల్ టెండర్లు ద్వారా గతంలో అనుభవం, ఇటువంటి నిర్మాణాలు చేసినవారికి నిర్మాణ పనులు అప్పగించడం జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు.
మంత్రులు పరిటాల సునీత , మాణిక్యాలరావు, పల్లె రఘునాథరెడ్డి, యనమల రామకృష్ణుడు, గుంటూరు జడ్పీ చైర్మన్ షేక్ జనీమూన్, శాసన సభ్యులు శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, మోదుగుల వేణుగోపాల్, రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర అధికారులు అజయ్ జైన్, శశిభూషన్, లింగపాణి పాణిగ్రహి, జాయింట్ కలెక్టర్ సిహ్. శ్రీధర్,వెలగపూడి సర్పంచ్ శాంతికుమారి, బెజవాడ జడ్పీటీసీ నరేంద్ర, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, వెలగపూడి గ్రామస్థులు సీతారామయ్య, వేణుగోపాల్ తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే వ్యాఖ్యాతగా వ్యవహరించడం.
ఈ చరిత్రాత్మక రాజధాని నిర్మాణంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖ్యాతి ప్రపంచ విఖ్యాతి కానున్నదని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. రైతులు చేసిన త్యాగాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయని వక్తలు అన్నారు. రాజధాని నిర్మాణంలో తొలి ఘట్టానికి ఈ రోజు శంఖుస్థాపన జరగడం పట్ల ఆనందం వ్యక్త పరిచారు.రాజధాని కోసం 22 వేలమంది రైతులు భూములు ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోని 18 కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రులు అన్నారు.
ఆనాడు ఇంద్రుడు అమరావతి పాలిస్తే, ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రుడు అమరావతిని నిర్మించి పరిపాలించుతున్నారని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు అందరూ భూములిచ్చిన రైతులుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ శ్రమదానం చేసి అద్భుతమయిన రాజధానిని నిర్మించుకొందామని అన్నారు. త్వరితగతిన పరిపాలన అందించాలనే ఉద్దేశ్యంతోనే తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు ఈరోజు శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సేకరించిన మట్టిని, నీరును ఈ శంఖుస్థాపన పూజ కార్యక్రమంలో వినియోగించారు.