రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రజా భవన్లో దాదాపుగా రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో రెండు కమిటీలు వేసి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఓ కమిటీ అధికారులతో.. మరో కమిటీ మంత్రులతో ఉండే అవకాశాలు ఉన్నాయి. సాగదీయకుండా ఓ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
బయట ప్రచారం జరిగినట్లుగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. భద్రచలం ముంపు సమస్య పరిష్కారం కోసం..కరకట్ట నిర్మించుకోవడానికి ఐదు గ్రామాలను మాత్రం… ఇవవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అధికారులు విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించింది. అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
రేవంత్, చంద్రబాబు మధ్య భేటీలో అద్భుతాలు జరుగుతాయని ఎవరూ అనుకోలేదు. కానీ ఓ రూట్ మ్యాప్ ఏర్పడుతుందని అనుకున్నారు. ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో హడావుడి చేశారు. కానీ నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయి.