కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. బ్రిటన్ నుంచి డయానా అవార్డు వచ్చింది. వర్చువల్‌గా దాన్నిహిమాన్షు అందుకోబోతున్నారు. మానవీయ దృక్పథంతో, సమాజంలో మార్పుకోసం కృషి చేసినవారికి ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పే రు మీద 1999 నుంచి ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఈ అవార్డును తొమ్మిది నుండి పాతికేళ్ల మధ్య ఉన్న వారికే ఇస్తారు. ప్రస్తుతం హిమాన్షు వయసు పదిహేనేళ్లు. ఈ అవార్డు సాధించేంతటి సేవ..కృషి హిమాన్షు ఏం చేశారనే సందేహం చాలా ఉంది. దానికి … కూడా డయానా అవార్డు ఇచ్చేవాళ్లు క్లారిటీ ఇచ్చారు.
చదువుకుంటూనే… తండ్రి, తాత బాటలో హిమాన్షు..గ్రామాల అభివృద్ధి కోసం ప్రాజెక్టులు చేస్తున్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో “శోమ” పేరుతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లోని రెండు గ్రామాల్లో కల్తీలేని ఆహార పదార్థాలు తయారుచేసే పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను సేకరించటం, వాటిని ప్రాసెసింగ్ చేయటం, ప్యాకింగ్ చేయడం వంటి బాధ్యతలన్నీ గ్రామస్థులకు అప్పగించారు. ఇందులో పనిచేసేవారిలో 50 శాతం మంది మహిళలే, ఈ ప్రాజెక్టులో వినియోగించిన యంత్రాలకు పూర్తిగా సౌరవిద్యుత్తునే వాడుతున్నారు. తన ప్రాజెక్టు ద్వారా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 సాధించినట్టు హిమాన్షు ప్రాజెక్ట్ రిపోర్టులో వెల్లడించారు.
తాత కేసీఆర్ సహకారంతోనే తనకు ఈ అవార్డు వచ్చిందని హిమాన్షు వినమ్రంగా చెబుతున్నారు.హిమాన్షు కేటీఆర్ కుమారుడు.. కేసీఆర్‌కు అత్యంత ప్రియమైన మనవడు. హిమాన్షు పక్కన లేకపోతే.. కేసీఆర్‌కు రోజు గడవదు. అధికార పెద్దలకు అంతటి ప్రీతిపాత్రమైన చిన్నోడు ఘనత సాధిస్తే టీఆర్ఎస్ నేతలు ఊరుకుంటుందా..? రచ్చ చేసేయరూ..! అదే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనూ హిమాన్షు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో హైలెట్ అయ్యారు. తల్లిదండ్రులు స్కూళ్లలో ఇచ్చే ప్రాజెక్టు వర్క్‌లో ఎక్కువ భాగం తామే చేస్తూంటారు. ఈ ప్రాజెక్ట్‌ను హిమాన్షు బదులుగా అధికారులే చేసి ఉంటారని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. కానీ.. హిమాన్షు తాత బాటలో ప్రజాసేవపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూంటారని టీఆర్ఎస్ నేతలు చెబుతూంటారు.