సుడిగాలి సుధీర్… జబర్దస్త్ తో పాపులర్ అయిన నటుడు. ఆ తరవాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఇప్పుడు ఓ స్కిట్ తనని వివాదంలో పడేసింది. హిందూ సంఘాలు సుధీర్ పై ఫైర్ అవుతున్నాయి.
ఓ టీవీ షోలో.. సుధీర్ ఓ స్కిట్ చేశాడు. నంది కొమ్ముల్లోంచి చూస్తే… రంభ కనిపించే సీన్ అది. దాంతో హిందుత్వ వాదులకు కోపం వచ్చింది. శివుడు అంటే తమాషాలా? నంది కొమ్ములోంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ… మీ పైత్యం కాదు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సుధీర్ తో పాటు, ఈ షో నిర్వహిస్తున్నవాళ్లు సైతం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి సుధీర్ సొంతంగా ఆలోచించి చేసిన స్క్రిప్టు కాదిది. ‘బావగారు బాగున్నారా’ సినిమాలో ఓ సీన్. అందులో రంభ – చిరంజీవి మధ్య ఈ సీన్ డిజైన్ చేశారు. ఈ సినిమా ఇంట్రవెల్ బ్యాంగ్ ఇది. అప్పట్లో థియేటర్లో క్లిక్ అయ్యింది. సుధీర్ చేసిన ఈ షోలో రంభ గెస్ట్. కాబట్టి… ‘బావగారు బాగున్నారా’ సీన్ రీ క్రియేట్ చేశాడు. అప్పట్లో హిందూ సంఘాలు ఇంత యాక్టీవ్ గా లేవు. సోషల్ మీడియా అస్సలు లేదు. కాబట్టి ఎవ్వరికీ ప్రాబ్లెం రాలేదు. ఇప్పుడు అలా కాదు కదా. అందరి మనోభావాలు చాలా సింపుల్ గా దెబ్బతినే రోజుల్లో ఉన్నాం. అందుకే సుధీర్ బలయ్యాడు.
సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తున్న ఇలాంటి కాలంలో, ఈ తరహా ప్రయత్నాలు చేసినప్పుడు సుధీర్ లాంటివాళ్లు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది. లేదంటే ఇలానే బుక్ అయిపోతారు.