నందమూరి బాలకృష్ణ తనదైన రాజకీయంచూపించారు. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ చేతుల్లోకి వచ్చేలా చేశారు. ఈ రోజు జరిగిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ విజయం సాధించారు. ఆయనకు ఇరవై మూడుఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి అధికారికంగా 23 మంది కౌన్సిలర్లు ఉన్నా.. సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. గత మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ సహా కౌన్సిలర్లు అంతా టీడీపీలో చేరిపోయారు.
మున్సిపల్ ఎన్నికకు ముందే వైసీపీ పరాజయం ఖాయమయింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎవరూ ఆ పార్టీ క్యాంపు లో లేరు. అందరూ టీడీపీ క్యాంపులోనే ఉన్నారు. హిందూపురంలో గెలిచి తీరాలన్న బాధ్యతను మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ కు వైసీపీ హైకమాండ్ ఇచ్చింది. అయితే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. గెలిచినా గెలవకపోయినా పోయేదేమీ లేదని సైలెంటుగా ఉన్నారు.
గతంలో టీడీపీలో చేరి తర్వాత జగన్ సమక్షంలో నలుగురు కౌన్సిలర్లు వైసీపీలో చేరారు. వారు కూడా వైసీపీకి మద్దతుగా ఓటేయలేదు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క సారిగా కూడా ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. వైసీపీ లెక్కలేనన్ని అరాచకాలు చేసి.. మున్సిపల్ స్థానాల్లో ఆరు కౌన్సిలర్ సీట్లకే టీడీపీని పరిమితం చేసింది. కానీ అధికారం పోయాక ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.