ఏపీలోని వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి హిందూపురం. బాలకృష్ణ హ్యాట్రిక్ కోసం పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ ఓడిపోయిన చరిత్ర లేదు. కొన్ని సార్లు ప్రజలు వ్యతిరేకమైనా.. ఓడిపోకుండా ప్రత్యర్థులే రెబల్స్ గా నిలబడి సాయం చేశారు. ఈ సారి కూడా నేతల్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారు. అధికారంలో ఉండటంతో ఆధిపత్య పోరాటంతో చివరికి హత్యలు కూడా చేసుకున్నారు. ఉన్న గ్రూపులు చాలవన్నట్లుగా బయట నుంచి అభ్యర్థిని తీసుకు రావడంతో మరో గ్రూప్ తయారయినట్లయింది.
హిందూపురంలో టీడీపీని ఓడించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఇచ్చారు. ఆయన పుంగనూరులో కంటే హిందూపురంలోనే ఎక్కువ కాలం గడిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇక్బాల్ కే సీటిస్తామని ఆశ పెట్టి చివరికి దీపికారెడ్డి అనే హిందూపురానికి సంబంధం లేని మహిళను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆమె భర్త రెడ్డి.. ఆమె మాత్రం బీసీ వర్గమని వైసీపీ ప్రచారం చేస్తోంది. బీసీ మహిళను పెట్టామని అంటున్నారు.
వైసీపీలో గ్రూపుల గోల కామన్. హిందూపురంలో బాలయ్య ప్రత్యర్థులుగా 2014లో నవీన్ నిశ్చల్, 2019లో మైనార్టీ నేత ఇక్బాల్ పోటీ చేశారు. టిక్కెట్ ఆశించే నేతలు ఇంకా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీతో పాటు మరికొందరు నేతలు ఒకరంటే ఒకరికి పడకుండా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడూ అదే విధంగా ఉన్నారు. ఇక్బాల్ టీడీపీలో చేరిపోయారు. ఇతరులు దీపికాకు పని చేయడం లేదు. ఇలాగే రాజకీయం జరిగితే బాలకృష్ణ మెజార్టీ పెరుగుతుందని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు.
ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన బాలకృష్ణ 2014లో హిందూపురంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వ ఆ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచిన బాలయ్య.. 2019 ఎన్నికల్లో కూడా మరోసారి జయకేతనం ఎగరేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం.. బాలయ్య 2014 కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నారు బాలయ్య. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ చేసిన అభివృద్ధి నియోజకవర్గం మొత్తం కనిపిస్తుంది. హిందూపురంకు దశాబ్దాల కల అయిన నీటి సౌకర్యం కూడా కల్పించారు.
గత ఐదేళ్లుగా అభివృద్ది అనేదే లేదు. వైసీపీ నేతల దందాలతో హిందూపురం అట్టుడికిపోయింది. వైసీపీ కీలక నేత హత్య కావడం కూడా కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి… ఎంత ఖర్చుకు అయినా వెనుకాడకుండా నేతల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవి వైసీపీని కాపాడతాయా లేదా అనేది ఎన్నికల్లో తేలుతుంది.