అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్ధిగా పోటీపడుతున డోనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం, ప్రపంచ దేశాలపట్ల ముఖ్యంగా ముస్లిం ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలతో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ మాట తూలని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా ఆయన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. చివరకి రిపబ్లికన్ పార్టీలో సీనియర్ నేతలే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టడానికి అనర్హుడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక చాలా దేశాలు ఆయన వైఖరిని ఖండిస్తూనే ఉన్నాయి. కనుక అవి ఆయన ఓటమిని మనసారా కోరుకొంటే ఆశ్చర్యమేమీ లేదు.
అటువంటి ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ హిందూ సేన కార్యకర్తలు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిన్న హోమం చేసారు. ట్రంప్ ఫోటో దాని క్రింద “వియ్ లవ్ ట్రంప్, వియ్ సప్పోర్ట్ ట్రంప్” అని ముద్రించిన ఫ్లెక్సీ బ్యానర్లను సందర్భంగా ప్రదర్శించారు. ఉగ్రవాదుల బారి నుంచి ఈ ప్రపంచాన్ని ట్రంప్ ఒక్కరే కాపాడగలరని అందుకే ఆయన విజయం కోసం దేవుడిని ప్రార్దిస్తూ హోమం చేసామని వారు చెప్పకొన్నారు.
హిందూ సేన గురించి ఎవరూ వినలేదు. కనుక మీడియా దృష్టిని ఆకర్షించి తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నంలోనే వారు ఆ పని చేసి ఉండవచ్చు లేదా ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్నట్లుగా ట్రంప్ మాట్లాడుతున్నారు కనుక వారికి ఆయన బాగా నచ్చేసి ఉండవచ్చు. కానీ అదే ట్రంప్ అమెరికాలో స్థిరపడిన భారతీయులతో సహా విదేశీయులు అందరూ అక్రమవలసదారులే అన్నట్లుగా మాట్లాడుతూ, తను అధ్యక్షుడయితే తమ ఉద్యోగాలను దోచుకొంటున్న చైనా, భారత్ తదితర దేశస్తులందరినీ వెనక్కి తిప్పి పంపించేస్తానని హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలు హిందూ సేన చెవికెక్కినట్లులేదు. వారికి ఆయనలోని ముస్లిం వ్యతిరేకత, ఉగ్రవాదులపై అణుబాంబులతో దాడి చేస్తామని చెపుతున్న మాటలే నచ్చినట్లున్నాయి. అయితే ఆయన ఒకవేళ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యి అదే విధంగా వ్యవహరిస్తే, ఆయన వలననే యావత్ ప్రపంచం అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉంటుందనే అమెరికన్లే భయపడుతున్నారు. అటువంటి వ్యక్తి కోసం పూజలు, హోమాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.